TRINETHRAM NEWS

కార్డియాక్ అరెస్టుతో 24 నిమిషాల పాటు అపస్మారస్థితిలో మహిళ! కోలుకున్నాక ఆమె చెప్పింది ఏంటంటే..

గత ఏడాది మహిళకు కార్డియాక్ అరెస్ట్

24 నిమిషాల పాటు అపస్మారక స్థితిలో మహిళ,

క్లినికల్లీ డెడ్‌గా ప్రకటించిన వైద్యులు

సీపీఆర్‌తో స్పృహలోకి వచ్చిన వైనం

మరణం అంచులవరకూ వెళ్లడంపై తన అనుభవాల్ని నెట్టింట పంచుకున్న మహిళ
ఆత్మలూ, స్వర్గం లాంటివేవీ కనిపించలేదని వెల్లడి

మనిషి చనిపోయాక ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కానీ, మరణం అంచుల వరకూ వెళ్లొచ్చిన ఓ మహిళ తన అనుభవాలను తాజాగా నెట్టింట పంచుకుంది. లారెన్ కెనెడే అనే మహిళ గతేడాది అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిపోయింది. ఆమె భర్త వెంటనే అత్యవసర మెడికల్ సిబ్బందికి సమాధానం ఇచ్చి ఆమెకు సీపీఆర్ నిర్వహించాడు. ఈలోపు అత్యవసర సిబ్బంది వచ్చి ఆమెకు దాదాపు 24 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ఆమె మళ్లీ ఈలోకంలోకి వచ్చేలా చేశారు. ఆ తరువాత రెండు రోజుల పాటు కోమాలో ఉన్నాక ఆమె స్పృహలోకి వచ్చింది. కానీ, అంతకుముందు వారం పాటు జరిగిన విషయాలన్నీ తన మెదడులోంచి తుడిచిపెట్టుకుపోయాయని ఆమె చెప్పుకొచ్చింది.

కార్డియాక్ అరెస్టుతో గుండె కొట్టుకోవడం ఆగిపోయిన వారికి తొలి పది నిమిషాలు చాలా కీలకం. ఆ సమయంలో వెంటనే సీపీఆర్ చేస్తే వారు మళ్లీ కోలుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. కానీ, తాజా ఘటనలో మహిళకు 24 నిమిషాల పాటు సీపీఆర్ చేశాక ఆమె మళ్లీ స్పృహలోకి వచ్చింది.

‘‘ఆ తరువాత నన్ను ఆసుపత్రిలో ఉంచారు. రెండు రోజుల పాటు కోమాలో ఉన్నా. స్పృహలోకి వచ్చే సరికి అనేక విషయాలు మర్చపోయా. అంతకుమునుపు వారంలో జరిగిన విషయాలేవీ గుర్తులేవు. కానీ మనసంతా ప్రశాంతత ఆవరించింది. ఆ భావన చాలాకాలం పాటు అలాగే కొనసాగింది’ అని ఆమె తెలిపింది

ఇలా మరణం అంచుల వరకూ వెళ్లి తిరిగి రావడాన్ని లాజరస్ ఎఫెక్ట్ అంటారు. గతంలో ఈ పరిస్థితి ఎదుర్కొన్న పలువురు తమకు ఆత్మలు, స్వర్గం కనిపించాయని చెప్పారు. కానీ లారెన్ మాత్రం తనకు అలాంటి అనుభవాలేమీ లేవని పేర్కొంది. కేవలం మానసిక ప్రశాంతత మాత్రమే అనుభవించానని ఆమె చెప్పుకొచ్చింది.