MLA Adireddy Srinivas : విగ్రహాలు తొలగించబోం

TRINETHRAM NEWS

అఖిలపక్ష సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టీకరణ

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం, జూన్ 5: గోదావరి గట్టు వెంబడి ఉన్న 13 మహనీయుల విగ్రహాలను తొలగించబోమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక పేపర్ మిల్లు వద్ద కృష్ణ సాయి కల్యాణమండపంలో రాజమండ్రి వారసత్వ సంపద పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.న్యాయవాది మద్దూరి శివ సుబ్బారావు అధ్యక్షుత వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి సమన్వయ కర్తగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా ఆది రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి గట్టు సుందరీకరణ పేరుతో రివర్ ఫ్రంట్ నిర్మాణం జరుగుతున్న క్రమంలో అక్కడ ఉన్న విగ్రహాలను తొలగిస్తారని వస్తున్న వార్తలను ప్రస్తావించారు. ఆ విగ్రహాలను అన్నిటినీ ఒకటే యూనిఫాం గా ఉంచుతామని చెప్పారు. విగ్రహాల ఏర్పాటులో డామేజ్ జరిగితే ఆ స్థానే కొత్త విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రివర్ ఫ్రంట్ నిర్మాణం వల్ల పిండాల రేవు ఉనికికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గోశాల పక్కన ఉన్న స్థలంలో అపర కర్మల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు.
పురోహితుల వృత్తికి గానీ, శ్రాద్ధ కర్మలు నిర్వహించుకునే వారికి గాని రివర్ ఫ్రంట్ నిర్మాణం సమస్య కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. హావ్ లాక్ వంతెనను చారిత్రక, పర్యాటక ప్రాంతంగా చేసేందుకు రూ 100 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యిందని, దానికి అనుబంధంగా 50 కోట్లతో ఘాట్లను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో చొరవ చూపి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కేంద్ర కార్యాలయాన్ని రాజమండ్రికి తీసుకు రావడం అభినందనీయమన్నారు .
రానున్న గోదావరి పుష్కరాలకు లక్షల సంఖ్యలో యాత్రికులు రానున్నందున , ఆ మేరకు వేగంగా నగర అభివృద్ధి జరగాలంటే , కార్పోరేషన్ ఎన్నికలు వెంటనే జరిపించాలని డిమాండ్ చేశారు.బొమ్మూరులో నిర్మితమైన సైన్సు మ్యూజియంను ప్రారంభించాలని కోరారు. చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంటును రాజమండ్రిలోనే తొలుత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అందుకు అవసరమైన ముడిపదార్ధాలు నగరంలో ఎక్కువగా ఉన్నాయని విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు.

ఈ నెల 21న ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి 5 వేల మందితో ఒకే చోట యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి అందరూ తరలి రావాలని కోరారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్ ఆనుకుని ఉన్న ప్రదేశంలో సర్వీస్ రోడ్డు వేయాలని, అలాగే ఫ్లై ఓవర్ పై వీధి దీపాలు వేయాలని డిమాండ్ చేశారు.సీపీఐ జిల్లా కార్యదర్శి టి.మధు మాట్లాడుతూ గోదావరి గట్టుపైన మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర చౌదరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ మాట్లాడుతూ వర్షం ముంపుపై చర్యలు చేపట్టాలని, తాగు నీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు పలు తీర్మానాలను అఖిలపక్ష సమావేశం ఆమోదించింది. ఆ మేరకు వాటిని మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పంతం కొండలరావు, పరిరక్షణ సమితి కార్యవర్గ సభ్యులు దేశి రెడ్డి బలరామ నాయుడు , విగ్రహాల పరిరక్షణ కన్వీనర్ మాదేటి రవి ప్రకాష్, ఆంధ్ర కేసరి యువజన సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్, సానబోయి రామారావు, ఎల్.వి.ప్రసాద్, కె.కె.సంజీవ రావు, అబ్దుల్లా షరిష్, అసదుల్లా అహ్మద్, దూర్వాసుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Statues will not be removed

You cannot copy content of this page

Scroll to Top