CITU : కార్మిక వర్గ కష్టాల విముక్తికి సీఐటీయు జెండానే పరిష్కారం

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ – మే 31: భారతదేశంలోని అన్ని వర్గాల కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ, వారి హక్కుల సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తోంది సీఐటీయూ అని జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం అరకు వ్యాలీ మండలంలోని పద్మపురం గార్డెన్ వద్ద జరిగిన సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన జెండా ఆవిష్కరించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 1970లో సీఐటీయూ ఆవిర్భవించి నాటి నుండి కార్మిక వర్గానికి వెన్నుదన్నుగా నిలుస్తూ, పదుల సంఖ్యలో కార్మిక చట్టాలు సాధించిందని, దేశంలోని పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, కార్మికుల కనీస వేతనాల కోసం, హక్కుల కోసం శ్రమజీవులతో కలిసి పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. మే నెలను కార్మికుల మాసంగా గుర్తుంచుకోవాలని, మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటే, భారతదేశంలో సీఐటీయూ మే 30న ఆవిర్భవించిందని తెలిపారు.
కార్మికుల్లో కుల, మత, ప్రాంత భేదాలు తొలగించి దేశ సమైక్యతకు దోహదపడేలా సీఐటీయూ పనిచేస్తోందని, కార్మిక వర్గ రాజ్య స్థాపన లక్ష్యంగా కృషి కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అమలులో ఉన్న 44 లేబర్ చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కోడ్స్ కార్మికుల హక్కులను కాలరాసే విధంగా రూపొందించబడ్డాయని విమర్శించారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ఈ నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి, గత చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఎ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దాడి రాజు, ఆటో కార్మిక సంఘం నాయకుడు రమేష్, పద్మపురం గార్డెన్ వర్కర్స్ నాయకులు శ్రీరామ్, జగ్గారావు, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్మికులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CITU flag is the

You cannot copy content of this page

Scroll to Top