నవల పుస్తకాన్ని ఆవిష్కరించిన వీసీ ప్రసన్నశ్రీ
చల్లా మహీరమకు వీసీ ప్రశంసలు
Trinethram News : రాజమహేంద్రవరం నగరానికి చెందిన 13 సంవత్సరాల చల్లా మహీరమ ప్రకృతి, పంచభూతాల కథాంశంగా చిన్నారులు పాత్రధారులుగా ఆంగ్లంలో “రూబీస్ బ్లూస్ట్రీమ్ అండ్ ది బాండ్ ఆఫ్ ఫైర్” పేరుతో ఆసక్తికర కథనంతో ఫిక్షన్ నవలను వ్రాసి రికార్డు సృష్టించిందని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ అన్నారు. గురువారం ఆదికవి నన్నయ యూనివర్సిటీలో మహీరమ వ్రాసిన పుస్తకాన్ని వీసీ ఆవిష్కరించి 13 సంవత్సరాలకే ఆంగ్ల నవల పుస్తకాన్ని రాసిన చల్లా మహీరమ ను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు చల్లా వెంకట సుబ్బరాయశాస్త్రి (సివిఎస్ శాస్త్రి) మనవరాలైన మహీరమ 13ఏళ్లకే ఇంగ్లీషు భాషలో “రూబీస్ బ్లూస్ట్రీమ్ అండ్ ది బాండ్ ఆఫ్ ఫైర్” పేరుతో ఆసక్తికర కథనంతో ఫిక్షన్ నవలను రాసారని ప్రశంసించారు.
సివిఎస్ శాస్త్రి కుమారుడు రోషన్ కృష్ణ, వెంకట సాయిసుధ దంపతుల కుమార్తె అయిన మహీరమ 6వ ఏట వరకు అమెరికాలో పెరిగిందని, ప్రస్తుతం తండ్రి ఉద్యోగ రిత్యా హైదరాబాద్ లో 9వ తరగతి చదువుతోందని తెలిపారు. నేటి రోజుల్లో తోటి వయస్సు పిల్లలంతా సెల్ ఫోన్ల మాయలో పడితే మహీరమ మాత్రం 8వ ఏట నుంచే రచనా వ్యాసంగాన్ని చేపట్టడం విశేషమన్నారు. నవలా రచనలో తనదైన శైలిని, సొంత పదసంపదను సృష్టించడం మహీరమ ప్రత్యేకత అని తెలిపారు. అలాగే కర్ణాటక గాత్ర సంగీతంలో 4వ గ్రేడ్ శిక్షణ పొందుతోందని, కీబోర్డు, చిత్రలేఖనం, సొంతంగా పాటలు రాస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదగడం అరుదైన రికార్డు అని అన్నారు.
భాష, సంస్కృతి, సంగీతం, సాహిత్యాలలో తనను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను, బందువులను అభినందించారు. నేటి తరం యువత చల్లా మహీరమ ను స్ఫూర్తిగా తీసుకొని మంచి లక్షణాలతో ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. రచయిత్రి చల్లా మహీరమ మాట్లాడుతూ ప్రకృతితో మానవుడి అనుబంధం, ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఏర్పడే పర్యావసనాలు, జీవిత గమ్యాన్ని ఈ రచనల ద్వారా చెప్పడం జరిగిందన్నారు. ప్రకృతి అంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకే తాను అనుభూతి చెంది నవలలు రాస్తున్నానని తెలిపారు. లండన్ లో ఉంటున్న గంధం పావన ఈ నవలకు ఆకట్టుకునేలా కవర్ పేజీని రూపొందించాని తెలిపారు.
19 గిరిజన భాషలకు లిపిని రూపొందించిన వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ చేతుల మీదుగా తన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తనను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, తాత మామలకు, గురువులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహీరమ తల్లి చల్లా సాయి సుధా, అమ్మమ్మ తాతయ్యలు గోపాలమ్మ, ఎ.వి.ఎస్.రాజు, స్పృహా అలూమ్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ సుంకర నాగేంద్ర కిషోర్ మరియు విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


