అల్లూరి జిల్లా (అరకులోయ) త్రినేత్రంన్యూస్,మే 13 : దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు మే 20న చేపట్టే సమ్మెకు అనుసంధానంగా, అరకు ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న టూరిజం కార్మికులు కూడా సమ్మెలో పాల్గొననున్నట్లు ఐటిడిఏ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షుడు దాడి రాజు, సీఐటీయూ విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సంబంధిత యూనిట్ల మేనేజర్లకు సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగిందని వారు వెల్లడించారు.
గిరిజన మ్యూజియం, పద్మావతి గార్డెన్, చాపరాయి, కొత్తపల్లి జలపాతం వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో పనిచేస్తున్న కార్మికులు విధులు బహిష్కరించనున్నారు. నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, కార్మికులందరినీ రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాన్ని రూ.26,000 గా నిర్ణయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న కార్మికులకు పర్మనెంట్ చేయకపోవడమే కాకుండా, చట్టప్రకారం ఉండాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ వంటి హక్కులను కూడా కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న జీవిత ఖర్చులకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడంతో కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు తెలిపారు.
సమ్మె విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిస్తూ, అన్ని యూనిట్లను తాత్కాలికంగా మూసివేసి విధులను బహిష్కరించనున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వంతల రాజు, జయరాజు, రాంబాబు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


