Janasena : జివో నెంబర్ 3 పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వాన్ని కోరిన జనసేన

TRINETHRAM NEWS

ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్

అల్లూరిజిల్లా (పాడేరు) త్రినేత్రం న్యూస్,మే 4: ఆదివాసీ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని, జివో నెంబర్ 3కు ప్రత్యామ్నాయం తీసుకురావాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ జనసేన పార్టీ పాడేరు అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత తీవ్రంగా డిమాండ్ చేశారు. ఆదివాసీల కోసం ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆమె ఓ ప్రకటనలో వెల్లడించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య, అరకు పార్లమెంట్ ఇంచార్జ్ శెట్టి చిరంజీవి, పాడేరు టీడీపీ ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ దొన్ను దొర, జిసిసిసి చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్, బీజేపీ ఇంచార్జ్ ఉమా మహేశ్వరరావు తదితరులు జీవో 3 పట్ల తమ అభిప్రాయాలను వినతిపత్రాల రూపంలో ప్రభుత్వానికి అందించారని తెలిపారు.
గత వైకాపా ప్రభుత్వం ఆదివాసీ యువతను తీవ్రంగా నెరవేళ్చిందని దివ్యలత ఆరోపించారు. జివో నెంబర్ 3పై సుప్రీంకోర్టులో విచారణ జరిగి, ధర్మాసనం దాన్ని కొట్టి వేయగా, వైకాపా ప్రభుత్వం రివ్యూ పిటిషన్ కూడా వేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. దీంతో గిరిజన నిరుద్యోగులకు న్యాయం జరగలేదని మండిపడ్డారు.
ఈ జీవోను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కోర్టులో వాదనలు వినిపించాలన్నా, లేదా కొత్త చట్ట తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. ఈ జీవోను తీసుకురావడంలో నారా చంద్రబాబు నాయుడి పాత్రను గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలోనే అనేక డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలై ఉద్యోగ అవకాశాలు కలిగాయన్నారు.
వైకాపా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి గిరిజన నిరుద్యోగుల్ని మభ్యపెట్టిందని విమర్శించారు. జివో 3 రద్దయినా ప్రభుత్వంగా స్పందించకపోవడం, రివ్యూ దాఖలు చేయకపోవడం బాధాకరమని అభిప్రాయపడ్డారు.
అప్పటి వైకాపా ప్రజా ప్రతినిధులైన కోటగుళ్లి భాగ్యలక్ష్మి, శెట్టి ఫాల్గుణ్, ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు, మెంబర్ మత్స్యరస విశ్వేశ్వరరాజు, డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి జాతీయ గిరిజన ద్రోహులుగా పేరుపొందారని విమర్శించారు.
ప్రస్తుత జివో 3 ఉద్యమాల వెనుక ఉన్న వైకాపా నేతల ఉద్దేశ్యం రాజకీయ లబ్ధి కోసమేనని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించేందుకు ప్రజా సంఘాలన్నీ కృషి చేయాలని దివ్యలత పిలుపునిచ్చారు.
“ఇప్పటికైనా నిజమైన చిత్తశుద్ధితో అసెంబ్లీలో గిరిజనుల హక్కుల కోసం వాదించాలి. కూటమి ప్రభుత్వం ఆదివాసీ ప్రజల పక్షాన నిలుస్తుంది,” అని హామీ ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Janasena asks coalition government

You cannot copy content of this page

Scroll to Top