అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజకవర్గం ఇంచార్జ్, ఏప్రిల్ 29: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై గిరిజన సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. షెడ్యూల్డ్ ఏరియాలలో 100 శాతం ఆదివాసీ రిజర్వేషన్ల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని గిరిజన నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మే 2వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో గిరిజన నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకుడు వంతల అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వీరు మాట్లాడుతూ, ఏప్రిల్ 20న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, షెడ్యూల్డ్ ఏరియాలో 100 శాతం రిజర్వేషన్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం వల్ల ఆదివాసీలకు అన్యాయం జరిగిందన్నారు. అల్లూరి జిల్లాలో 400 పోస్టులలో కేవలం 24 పోస్టులు మాత్రమే ఎస్టీలకు కేటాయించడంతో 94 శాతం పోస్టులు నాన్-ట్రైబ్స్‌కు వెళ్ళాయని చెప్పారు.
గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం. 3 ను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో, ఆర్క్షణపై టి.ఎ.సి. సమావేశాలలో చర్చించి, “రెగ్యులేషన్ 1 ఆఫ్ 2021” ను ఆమోదించినప్పటికీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టలేదని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్ అభిప్రాయానికి ఫైల్ పంపినప్పటికీ ఇప్పటికీ ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2024లో అరకు సభలో, 2023లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో, 2024 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి ఆదివాసీలకు 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, దానిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని నేతలు ఆరోపించారు. రాజ్యాంగం 5వ షెడ్యూల్ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా ఎలాంటి ఉత్తర్వులు అమలవ్వవని, టి.ఎ.సి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.
ఈ సమావేశంలో పీఆర్టీయూ జిల్లా నాయకులు ప్రకాష్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పుడిగి దేముడు, ఆదివాసీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు చట్టు మోహన్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రమేష్, నాగేంద్ర, డి.ఎల్.ఓ. నాయకులు ప్రసన్న, పెసా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన అభ్యర్థులకు ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో 100 శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలు చేయాలని, ఏజెన్సీ పోస్టులను జనరల్ డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


