WhatsApp Image 2025 01 31 at 15.38.38
ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన వ్యక్తి రసూల్ బేగ్
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా కంభం. ఏ గురువు పేరు పలికితే ఆ గురువు పనిచేసిన పాఠశాల కళ్ళముందు కనిపిస్తుందో , ఏ పాఠశాల పేరు పలికితే ఆ గురువు మాత్రమే గుర్తుకొస్తారో వారే ఉత్తమ ఉపాధ్యాయులని, ఆ వరుసలో మొట్టమొదట కనిపించే అత్యుత్తమ గురువు మన మొఘల్ రసూల్ బేగ్ ని ఎంఈవోలు 1&2 మాల్యాద్రి , శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన పదవీ విరమణ సందర్బంగా స్థానిక పార్కు వీధి పాఠశాలలో ఉద్యోగ విరమణ అభినందన సన్మాన సభను భారీ ఏర్పాట్లతో ఘనంగా నిర్వహించారు.
గత 37 సంవత్సరాలుగా ఓనమాలను ఊయలూపుతూ, జ్ఞాన శిఖరాలను పేర్చి కూర్చి, ఓర్పుకు…ఉపమానమై తీర్పుకు…ఉపమేయమై అందరి హృదయాలలో అచ్చు వేయబడిన ఆది గురువుగా ఆయన నిలిచివుంటారని వక్తలు కొనియాడారు. సొంత నిధులతో వినూత్న బోధానోపకరణాలను రూపొందించి విద్యా విలువలకు అలంకారాలద్దిన త్యాగనిరతి ఆయన సొంతమని, నీతి, నిజాయితీ,నిరాడంబరత, ఓర్పు నేర్పుల నిలువెత్తు రూపమే ప్రధానోపాధ్యాయులు రసూల్ బేగ్ ని, గురువుగా వారి ఘనతను ప్రశంసించేందుకు పదాలు సరిపోవని అన్నారు.
ఆయన పనిచేసిన పాఠశాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంలో ఆయన కృషి ప్రశంసనీయమంటూ అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు మొఘల్ రసూల్ బేగ్ మాట్లాడుతూ ఉద్యోగ ప్రయాణంలో అనుక్షణం వెన్నంటి, తన ఉనికికి ఊతగా నిలిచిన అర్ధాంగి సేవలను, సమయస్ఫూర్తిని వివరిస్తూ,తన విజయం వెనుక రహస్యాన్ని వెల్లడించారు. ఈరోజుతో బడికి దూరమవాలన్న బాధను వ్యక్తం చేస్తూ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం బంధువులు, ఎంఈవోలు, మాజీ ఎంఈవోలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, పలువురు ఉన్నతాధికారులు, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి బహుమతులను అందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
