TRINETHRAM NEWS

టెయిల్ ఎండ్ ప్రాంతాల ఆయకట్టు సమస్యలకు శాశ్వత పరిష్కారంగా పత్తిపాక రిజర్వాయర్

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు

*సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ తో రైతులకు అధిక లాభం

*ఆర్థిక వనరులు సమకూరుస్తూ ఒక్కో హామీ అమలు చేస్తున్నాం

*ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామంలో రిజర్వాయర్ నిర్మించే స్థలాన్ని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు

ధర్మారం, నవంబర్ -24: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

టెయిల్ ఎండ్ ప్రాంతాల ఆయకట్టు సమస్యలకు శాశ్వత పరిష్కారంగా పత్తిపాక రిజర్వాయర్ నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు.

ఆదివారం ధర్మారం మండలంలో పత్తిపాక గ్రామంలో నిర్మించు ప్రతిపాక రిజర్వాయర్ స్థలాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష , ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి పరిశీలించారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం ద్వారా పెద్దపెల్లి జిల్లా రైతాంగానికి మేలు జరుగుతుందని ఆలోచనతో ఇక్కడి ప్రజాప్రతినిధులు నీటి పారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి ప్రాథమిక పనులు ప్రారంభించామని అన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన స్థలం, భూ సేకరణ ప్రతిపాదనలు , ఇతర అంశాలతో కూడిన డిపిఆర్ తయారు చేస్తున్నామని అన్నారు.

ప్రభుత్వం చేపట్టే పత్తిపాక రిజర్వాయర్ ద్వారా జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతూ 2 లక్షల 40 వేల ఎకరాల స్థిరీకరణతో పాటు నూతనంగా 10 వేల ఎకరాల ఆయకట్టు వస్తుందని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో అధిక లాభం సమకూరే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. టెయిల్ ఎండ్ ప్రాంతాల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా పత్తిపాక రిజర్వాయర్ నిలుస్తుందని మంత్రి అన్నారు.

గతంలో కూడా జిల్లాకు ఆయకట్టు అందించే ఎస్ ఆర్ ఎస్ పి, ఎల్లంపల్లి, వరద కాలువ, మిడ్ మానేరు, లోయర్ మాలేరు డాం ప్రాజెక్టులను తమ హయాంలోని నిర్మించామని అన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం కోసం స్థానిక ప్రజా ప్రతినిధులైన ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రభుత్వంపై బాగా ఒత్తిడి తీసుకొని వచ్చారని అన్నారు.

పెద్దపల్లి జిల్లా రైతుల చిరకాల ఆకాంక్ష పత్తిపాక రిజర్వాయర్ నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగుల వేస్తుందని, రైతులతో సంప్రదింపులు జరుగుతూ ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేస్తున్నామని అన్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో గతంలో ఎన్నడు లేని విధంగా మన రైతు సోదరులు అత్యధికంగా వరి సాగు జరిగే ఉత్పత్తి సాధించారని, వరి పంటకు మద్దతు ధరతో పాటు సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో రైతులకు ప్రతి బస్తాకు నాలుగు నుంచి ఐదు కేజీలు తరువు పేరుతో మోసం చేశారని, తమ ప్రజా ప్రభుత్వం రాగానే తరుగు లేకుండా పూర్తి స్థాయి పంట కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి సన్న రకం ధాన్యం వడ్లకు బోనస్ రైతులకు అందుతుందని, ఈ కార్యక్రమం వల్ల రైతులు చాలా సంతోషంతో ఉన్నారని మంత్రి తెలిపారు.

ఆర్థిక వనరులను సమకూరుస్తూ ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని అన్నారు. మన జిల్లా నుంచి గోదావరి జిల్లాలో తరలిస్తూ ఇక్కడ ఆయకట్టు పెంచడంలో గత ప్రభుత్వాలు ఘోర వైఫల్యం పొందాయని, మన దగ్గర బ్యారేజీలు నిర్మించినా ఎటువంటి అదనపు ఆయకట్టు రాలేదని అన్నారు.

ధర్మపురి నియోజకవర్గంలోనే శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ప్రభుత్వంతో మాట్లాడి యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాలను మంజూరు చేయించారని, తన శాసనసభ పరిధిలోని ఆరోగ్యం, పాఠశాలలు రోడ్ల నిర్మాణ పనులకు ప్రత్యేక కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణు, రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, నీటిపారుదల శాఖ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App