KA Paul : రేవంత్ రెడ్డితో పాల్ ముచ్చట..వివిధ అంశాలపై చర్చించాం
హైదరాబాద్ – ప్రజా శాంతి పార్టీ చీఫ్, ప్రముఖ మత బోధకుడు డాక్టర్ కేఏ పాల్ సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా పాల్ సీఎంతో ములాఖత్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్వయంగా షేర్ చేశారు ప్రజా శాంతి పార్టీ చీఫ్.
గత కొంత కాలం నుంచి తెలంగాణ లోనే ఉంటున్నారు పాల్. ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల ఫ్యామిలీని కడిగేస్తూ వచ్చారు. వారు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాల గురించి ఏకరువు పెట్టారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తను పోటీ కూడా చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నిర్వాకం వల్ల రాష్ట్రం అప్పుల ఊబి లోకి కూరుకు పోయిందని ఆరోపించారు. తాజాగా రాష్ట్రంలో సీన్ మారింది. పరిస్థితులు కూడా మారాయి. కొత్తగా కొలువు తీరింది కాంగ్రెస్ పార్టీ సర్కార్. బీఆర్ఎస్ శని పోయిందని, పీడ విరగడైందని సంచలన వ్యాఖ్యలు చేశారు డాక్టర్ కేఏ పాల్.
ఇదే సమయంలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ముచ్చటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు పాల్. కేవలం మర్యాద పూర్వకంగా సీఎంను కలుసుకున్నానని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు ప్రజా శాంతి పార్టీ చీఫ్.