Trinethram News : ప్రెస్‌నోట్, తేదీ- 10-02-2024
గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ నుంచి కలుషిత నీరు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు – ఎంపీ బాలశౌరి
అధికారుల నిర్లక్ష్యం వల్లే పద్మా అనే మహిళ మృతిచెందింది – ఎంపీ వల్లభనేని బాలశౌరి
జనసేన పార్టీ బాధితులకు అండగా ఉంటుందని – ఎంపీ బాలశౌరి
గుంటూరు నగరంలోని పలు కాలనీల్లో మున్సిపాలిటీ నుంచి వస్తున్న నీరు కలుషితం కావడంతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన తనను కలిచివేసిందని జనసేన నాయకులు, ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఎంపీ బాలశౌరి మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ సూచించారు. ఈ మేరకు శనివారం ఎంపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. గుంటూరు నగరంలోని శారదాకాలనీ, శ్రీనగర్, సంగడిగుంట, తదితర కాలనీల్లో మున్సిపాలిటీ కలుషితమైన నీరు తాగడంతో దాదాపు 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరూ ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
అయితే.. శనివారం నాడు పద్మ(18) అనే మహిళ మృతి చెందడంపై ఎంపీ బాలశౌరి స్పందించారు. గత వారం రోజులుగా కలుషిత నీరు వస్తున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించడం దారుణమని ఎంపీ బాలశౌరి తెలిపారు. కనీసం ప్రజలకు అవగాహన కల్పించకుండా కలుషిత నీరు విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు ఎంపీ బాలశౌరి సూచించారు. మృతి చెందిన బాధిత మహిళ కుటుంబాన్ని ప్రభుత్వ ఆదుకోవాలని అన్నారు. బాధితులకు అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేయాలన్నారు. జనసేన పార్టీ తరపున బాధితులను ఆదుకుంటామని ఎంపీ బాలశౌరి తెలిపారు.
ఎంపీ కార్యాలయం, గుంటూరు.