
దేవరకొండ నియోజకవర్గంలో రూ.2.14 కోట్ల విలువైన 339 చెక్కుల పంపిణీ
Government Welfare Schemes : దేవరకొండ డివిజన్ నవంబర్ 12, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మొత్తం 209 మంది లబ్ధిదారులకు రూ.84 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, అలాగే 130 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.1.30 కోట్ల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తంగా 339 మంది లబ్ధిదారులకు సుమారు రూ.2.14 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు.
నిమ్స్‌లో LOC ద్వారా ఉచిత వైద్య సేవలు వినియోగించుకోండి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. నిమ్స్ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి సహాయనిధి, LOC (లెటర్ ఆఫ్ క్రెడిట్) ద్వారా ఉచిత వైద్య సేవలు పొందిన వారిలో దేవరకొండ నియోజకవర్గ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం నిమ్స్ ఆసుపత్రిలోనే వైద్య సేవలు పొందుతున్నారని, అలాంటి అత్యుత్తమ వైద్య సదుపాయాలను పేద ప్రజలు కూడా LOC లెటర్ ద్వారా ఉచితంగా వినియోగించుకోవచ్చని వివరించారు. ఆర్థిక స్థోమత లేక వైద్యం చేయించుకోలేని నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి
రానున్న రోజుల్లో సూపర్ ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలపై రైతులు, ప్రజలు ముందస్తు అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, తక్కువ నీటితో సాగు చేసే పంటలు, ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకునేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
2028 జూన్ నాటికి దేవరకొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం
దేవరకొండ నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బాలు నాయక్ స్పష్టం చేశారు. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల ద్వారా దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికి సాగునీరు అందించి, మిర్యాలగూడ లేదా నాగార్జునసాగర్ ప్రాంతాల్లో ఉన్నట్లుగా పచ్చని పంటలతో దేవరకొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, ఆలంపల్లి నరసింహ, హనుమంతు వెంకటేష్ గౌడ్, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ పట్టణ కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe