ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
High Court Anger

ఒకే అంశంపై మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవడంపై ఫైర్
కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం వెనుక కారణమేంటని ప్రశ్న
ఇక్కడ బాధితుడు పిటిషనర్ కాదు..

స్వయంగా కోర్టేనని వ్యాఖ్యానించిన జడ్జి
విచారణకు స్వయంగా హాజరైన కమిషనర్
High Court Anger : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్: ప్రైవేటు భూమి వివాదంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే అంశానికి సంబంధించి మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవడం అత్యంత తీవ్రమైన విషయమని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం వెనక కారణమేంటని ప్రశ్నించింది. ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ చట్టానికి అతీతులు కాదని పేర్కొంది.

కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నంతకాలం వాటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామం సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాల భూమిలో ఈ నెల 17న హైడ్రా చేపట్టిన కూల్చివేతలను సవాల్ చేస్తూ శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ విచారించారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.హరీశ్ కుమార్ వాదిస్తూ, కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు భారీ బలగాలతో వచ్చి ప్రహరీ గోడతో పాటు నిర్మాణాలను కూల్చివేశారని తెలిపారు. ఇదే అంశంపై ఇప్పటికే రెండు కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. కోర్టు ఉత్తర్వులు చూపించినా లెక్కచేయకుండా పిటిషనర్‌పై దౌర్జన్యానికి పాల్పడి, అనంతరం పోలీసు కేసు నమోదు చేసి సాయంత్రం వరకు స్టేషన్‌లోనే నిర్బంధించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై స్పందించిన న్యాయమూర్తి, అవసరమైతే కమిషనర్‌ను బలవంతంగా కోర్టు ముందు హాజరుపరచాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో రంగనాథ్ స్వయంగా సాయంత్రం 6.30 గంటలకు కోర్టులో హాజరయ్యారు. విచారణ సందర్భంగా ఆయనను ఉద్దేశించి న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అలవాటుగా మారిందా? కోర్టు ధిక్కరణ పరిపాటిగా మారిందా? అంటూ ప్రశ్నించారు. ఇక్కడ బాధితుడు పిటిషనర్ కాదని, స్వయంగా కోర్టేనని వ్యాఖ్యానించారు. కోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేయడం తగదని, ఏ పని చేసినా చట్టానికి లోబడే చేయాలని స్పష్టం చేశారు.

ఉత్తర్వులు ఎందుకు ఉల్లంఘించారు?

ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఉత్తర్వులు అమల్లో ఉండగా వాటిని ఎందుకు ఉల్లంఘించారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని రక్షిస్తున్నామనే పేరుతో ప్రైవేటు భూమిలోకి ఎలా ప్రవేశిస్తారని నిలదీశారు. ఇప్పుడు అది రక్షణ శాఖ భూమి అని చెబుతున్నట్లయితే సంబంధిత శాఖను ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదని ప్రశ్నించారు. డివిజన్ బెంచ్ ఉత్తర్వులు అమల్లో ఉండగానే వాటికి విరుద్ధంగా వ్యవహరించడం న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. హైడ్రా తరఫున అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జీఎల్‌ఆర్ సర్వే నంబర్ 243లో 119 ఎకరాలు ప్రభుత్వ భూమి అని, సర్వే పూర్తి చేసి విభజన చేపట్టేందుకు కొంత గడువు ఇవ్వాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page