జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Legislator Distributes Induction Stoves

Legislator Distributes Induction : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 24; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఇంధన పొదుపును ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేస్తోందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కాలుష్యం తగ్గడమే కాకుండా ఒక్కో కేంద్రానికి నెలకు సుమారు రూపాయలు రెండు వందల నలభై ఏడు వరకు ఖర్చు ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేసిందన్నారు.

ఇప్పటివరకు అంగన్‌వాడీ కేంద్రాలు ఎల్పీజీ గ్యాస్‌పై ఆధారపడి నిర్వహించబడుతున్నాయని, గ్యాస్ వినియోగాన్ని తగ్గించి విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని శాసనసభ్యులు పత్స మట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం లో భీమడోలు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు మండలాలకు చెందిన నూట తొంభై ఆరు అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లతో పాటు వంట పాత్రలను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో కార్యకర్తలు మరింత కృషి చేయాలని సూచించారు. ఆ కేంద్రాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, భీమడోలు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి ఎం.ఎస్. రాజశేఖర్, పర్యవేక్షకులు నూర్జహాన్, భాగ్యలక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page