వీరగడ్డ బొడ్డపాడులో డిసెంబర్ 22న విప్లవ సాంస్కృతికోద్యమ యోధుడు కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి 54వ వర్ధంతి సభ
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక హాలు ఆవరణలో డిసెంబర్ 22వ తేదీన విప్లవ సాంస్కృతికోద్యమ యోధుడు కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి 54వ వర్ధంతి సభ జరుగుతుందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ప్రజా కళా మండలి శ్రీకాకుళం జిల్లా కమిటీల అధ్యక్షులు మార్పు మల్లేశ్వరరావు, రాపాక చిరంజీవులు నేడొక ప్రకటనలో తెలిపారు. కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి జీవిత సహచరి కామ్రేడ్ సురేఖా పాణిగ్రాహి అరుణ పతాకాన్ని ఎగరవేసి కామ్రేడ్ పాణిగ్రాహి చిత్రపటానికి పూల దండతో విప్లవ నివాళి అర్పించడంతో సభ ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుందని వారు తెలిపారు. వక్తలుగా ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ ) ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి యం. లక్ష్మి, విరసం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పాణి, ఆంధ్రప్రదేశ్ అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, ప్రజా కళామండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. నీలకంఠు , పలు విప్లవ, ప్రజా సంఘాల నాయకుల సందేశాలూ అరుణోదయ- ప్రజా కళా మండలి సంస్థల ‘ ఆటా… పాటా… మాట’ లతో రాష్ట్ర స్థాయి కళా ప్రదర్శనలూ ఉంటాయన్నారు.శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి… సాయంత్రం 4గంటల వరకూ సాగనున్న పాణిగ్రాహి స్మారక బహిరంగ సభకు కవులూ, కళాకారులు, ప్రజా సంఘాల నాయకులకూ ఆహ్వానం పలికామని మల్లేశ్వరరావు, చిరంజీవులు తెలిపారు. ప్రజల సహకారంతో మధ్యాహ్నం భోజన యేర్పాట్లూ వున్నాయనీ, రాష్ట్ర వ్యాప్తంగా అరుణోదయ, ప్రజా కళామండలి కళాబృందాలు బహిరంగ సభకు తరలి వస్తున్నాయని అన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని వారు కోరారు.