Trinethram News : ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీ ఢిల్లీ ఛలో ఇవాళ(ఫిబ్రవరి 21) మళ్లీ మొదలవనుంది. పలు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ఫెయిల్ అవడంతో రైతు సంఘాలు బుధవారం నుంచి మళ్లీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే..
అయితే రైతు నాయకులు కేంద్రానికి బుధవారం ఉదయం 11 గంటల దాకా సమయమిచ్చారు. ఈ లోపు ఏదో ఒకటి తేల్చకపోతే ఢిల్లీ ఛలో యథావిధిగా జరుగుతుందని తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. టిక్రీ, సింగు సరిహద్దులను పోలీసులు పూర్తిగా మూసేశారు. ఈ సరిహద్దుల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించడమే కాక కాంక్రీట్ బారికేడ్‌లను అడ్డుగా ఉంచారు. రైతుల నిరసన ర్యాలీ ఢిల్లీలోకి ప్రవేశిస్తే నగరంలో ట్రాఫిక్ గ్రిడ్‌లాక్‌కు దారి తీస్తుందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. అవసరమైతే ఘాజీపూర్ సరిహద్దును కూడా మూసివేస్తామని పోలీసులు తెలిపారు..
నోయిడా, గురుగ్రామ్‌లలోనూ టట్రాఫిక్ ఆంక్షలు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్‌లో మార్చ్ చేసేందుకు రైతులు ఇప్పటికే డిసైడయ్యారు. దీంతో ఇక్కడ ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. కీలకమైన పంజాబ్, హర్యానాల సరిహద్దు అయిన శంభు బోర్డర్‌లో భారీగా పోలీసులు మోహరించారు. హర్యానాలోని 7 జిల్లాలో బల్క్ ఎస్‌ఎమ్‌ఎస్‌లతో పాటు ఇంటర్నెట్ సర్వీసులను ప్రభుత్వం ఇప్పటికే నిలిపివేసింది..
ర్యాలీ చేసే రైతుల వద్ద ఉన్న జేసీబీ వంటి యంత్రాలను సీజ్ చేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని హర్యానా ప్రభుత్వం ఇప్పటికే కోరింది. కాగా, ఈ నెల 13న రైతులు మొదటిసారి ఢిల్లీ ఛలోకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత కేంద్రం వారితో చర్చలు జరిపింది. ఈ చర్చలు ఫెయిల్ అవడంతో రైతు సంఘాలు మళ్లీ బుధవారం నుంచి ఛలో ఢిల్లీ ర్యాలీ పునరుద్ధరిస్తామని ప్రకటించారు. .