What did CM Revanth Reddy say after the meeting with the Prime Minister?
Trinethram News : ఢిల్లీ: తెలంగాణ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల, అభివృద్ధికి సహకరించాలని వినతిపత్రం ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మోడీ, అమిత్ షాతో భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ముగిశాయి కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలని పలువురు కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. తాను చేసిన విజ్ఞాపనలకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు. భేటీలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..” గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి కోల్ బ్లాక్స్ వేలం లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని ప్రధాని మోడీని కోరాం. తెలంగాణకు ఐఐఎం, ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. రాష్ట్రంలో సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాకు నవోదయ, కస్తూర్బా విద్యాలయాలు ఇవ్వాలని విన్నవించాం.
రక్షణ శాఖ భూముల విషయంలోనూ చర్చలు జరిపాం. ఏపీ విభజన చట్టం షెడ్యూల్ 9, 10లో అపరిష్కృత అంశాలకు వెంటనే పరిష్కారం చూపాలని, రాష్ట్ర రహదారులను జాతీయ రాజదారులుగా అభివృద్ధి చేయాలని కోరాం. రీజనల్ రింగ్ రోడ్డుకు ఒకే నంబర్ ఇవ్వాలని ప్రధానికి చెప్పాం. భద్రాచలం మండలంలోని ఐదు విలీన గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేశాం. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ సాధించడం కోసం మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు అన్ని అంశాలను పరిష్కరిస్తామని కేంద్రంa హామీ ఇచ్చింది” అని తెలిపారు.
ఈటెలకు కేసీఆర్‌పై ఇంకా ప్రేమ తగ్గలేదు..
టీపీసీసీ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ పరిశీలనలో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పదవుల విషయంలో తమకు ఏకాభిప్రాయం ఉందని, ఎందుకు ఆలస్యం అవుతుందో ఏఐసీసీ పెద్దలనే అడగాలన్నారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఈటెల ఎక్కడున్నారు. 20ఏళ్లు బీఆర్ఎస్‌లో ఉన్న ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలంటూ చురకలు అంటించారు. ఈటెలకు ఇంకా కేసీఆర్‌పైన ప్రేమ తగ్గలేదని వ్యంగాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్‌లో జీరో చేశామని, టార్చ్‌లైట్ పెట్టి వెతికినా ఒక్క ఎంపీ కనిపించరని ఎద్దేవా చేశారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App