TRINETHRAM NEWS

దేశంలో యూపీఐ (UPI) సేవలకు అంతరాయం ఏర్పడింది. యూపీఐ లావాదేవీలు సక్రమంగా జరగడం లేదంటూ పలువురు వినియోగదారులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి వివిధ బ్యాంకింగ్‌ సేవలతోపాటు గూగుల్‌ పే, ఫోన్‌ పే, భీమ్‌, పేటీఎం వంటి యాప్‌ల వినియోగంలో ఇబ్బందులు ఎదురైనట్లు వారి పోస్టుల బట్టి తెలుస్తోంది. సర్వర్‌ సంబంధిత సమస్యలూ ప్రస్తావించారు. నగదు బదిలీ, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలకు ఆటంకాలు ఎదురైనట్లు హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదితర బ్యాంక్‌ల వినియోగదారుల నుంచి ఫిర్యాదులు నమోదైనట్లు ‘డౌన్‌డిటెక్టర్‌’ సంస్థ తెలిపింది.
ఈ వ్యవహారంపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా స్పందించింది. తమ సేవలపట్ల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. కొన్ని బ్యాంకుల సేవల్లో సాంకేతిక కారణాల వల్ల ఇలా జరిగినట్లు పేర్కొంది. ఎన్‌పీసీఐ వ్యవస్థలు బాగానే ఉన్నాయని, సేవలు యథావిధిగా కొనసాగేందుకు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.