10 మంది కాదు 13 మంది కీచకులు’.. విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్..
విశాఖలో సంచలనం రేపిన గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తులో సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. 13 మంది నిందితులపై పోక్సో కేసు ఫైల్ అయింది. నిందితుల్లో 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఇమ్రాన్, షోయబ్ పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. మరోవైపు గ్యాంగ్ రేప్ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం సీపీని చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. బాధిత బాలిక వివరాల గోప్యత పాటించడంతో పాటు వైద్య సదుపాయం, రక్షణ కల్పించాలంటూ కోరారు. ఈ మేరకు వాసిరెడ్డి పద్మ విశాఖ సీపీకి లేఖ రాశారు.
ఇమ్రాన్ అనే యువకుడు ప్రేమ పేరిట బాధితురాల్ని మోసం చేశాడు. అతని ఫ్రెండ్ షోయబ్‌ను ఉసిగొల్పాడు. వాళ్లిద్దరి చేతిలో మోసపోయిన బాధితురాలు డిప్రెషన్‌లోకి వెళ్లింది. బీచ్‌లో ఒంటరిగా ఉన్న ఆమెను ట్రాప్ చేశారు ఫోటో గ్రాఫర్లు.. సాయం చేస్తామని నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. దర్యాప్తులో పక్కా ఆధారాలు సేకరించారు దిశ పోలీసులు. విశాఖలోని లాడ్జ్‌లో లక్ష్మీ ఇన్ లాడ్జిల్లో పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్టు తేలింది. లాడ్జిల్లోని హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుల్లో బీచ్ ఫోటోగ్రాఫర్లు షరీఫ్ అలియాస్ రాజు అలియాస్ చెర్రీ, వంకా గోపి, సురేష్, హరీష్ అశోక్, నాగేంద్ర, శివరామకృష్ణ.. మరి కొంతమంది మరి కొంతమంది పాత్ర పై ఆరా తీస్తున్నారు.
గ్యాంగ్ రేప్ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదయింది. 13 నిందితుల్లో 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో వున్న ఇమ్రాన్, షోయబ్‌ల కోసం గాలిస్తున్నారు. నిందితులు జార్ఖాండ్‌కు పారిపోయారని సమాచారంతో స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. డిసెంబర్ 17 నుంచి 22 వరకు విశాఖలోని వేర్వేరు లాడ్జిల్లో బాలికపై అత్యాచారం జరిగినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. బాధితురాలు మైనర్ కావడంతో ఆమె గుర్తింపు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని.. నాలుగు నెలల్లోనే శిక్షపడేలా చర్యలు చేపడుతుమన్నారు పోలీసులు.
బీచ్ పోటోగ్రాఫర్లలో కొందరి నిర్వాకం స్థానికంగా సంచలనం రేపింది. జరిగిన ఘటనపై చిరువ్యాపారులు, పర్యటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దారుణాలు జరుగకుండా ఉండాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.