TRINETHRAM NEWS

వీఆర్వో తనను లంచం అడిగారని, తహసీల్దారుకు ఫిర్యాదు చేయడానికి రైతు వచ్చాడు . రైతును లంచం బారి కాపాడాల్సిందిపోయి.. ఆ సమయంలోనే లంచాన్ని సమర్థిస్తూ అనంతపురం జిల్లా మడకశిర తహసీల్దార్‌ ముర్షావలి చేసిన వ్యాఖ్యలు లంచగొండులు మీసం తిప్పుకునేలా ఉన్నాయి….

ఒక్కోసారి తమ ప్రాంతాలకు మంత్రులు, ఉన్నతాధికారులు వస్తారని, ఆ సమయంలో లక్షల రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. ఆ సమయంలో వారి కోసం తనకొచ్చే జీతాన్ని ఖర్చు పెట్టాలా..? అని ఆ తహసీల్దారు నిలదీశారు..

రాష్ట్రంలో ఏ సీఎం ఉన్నా, దేశంలో ఏ ప్రధాన మంత్రి ఉన్నా లంచాల విషయంలో ధోరణులు ఏవీ మారబోవని చెప్పారు. రెండు నెలల క్రితం రాష్ట్ర మంత్రి ఒకరు ఇక్కడికి వచ్చారని, ఆయన పర్యటనకు నలుగురు వీఆర్వోలు కలిసి రూ.1.75 లక్షలు ఖర్చు పెట్టారని అన్నారు.

వారికి తిరిగి ఒక్క రూపాయి కూడా రాలేదని తెలిపారు. మహిళా అధికారి తమ ప్రాంతానికి వచ్చిన సమయంలోనే ఇటువంటిదే జరిగిందని అన్నారు. ఆ అధికారిణి తిండికి కూడా బాగా ఖర్చు అయిందని తెలిపారు. ఆ ఖర్చంతా ఎవరు భరించాలని తమసీల్దారు నిలదీశారు.

లంచంగా తీసుకున్న డబ్బునే తాము మంత్రులు, అధికారులకు ఖర్చు పెడతామని, సొంతంగా వేతనాల్లోంచి ఖర్చు పెట్టుకోవాలా..? అని ప్రశ్నించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ తహసీల్దారును ఉన్నతాధికారులు గత రాత్రి సస్పెండ్ చేశారు.