సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
*సర్వే షెడ్యూల్ పై ముందస్తు ప్రచారం చేయాలి
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిప్యూటీ సీఎం
పెద్దపల్లి, నవంబర్ -09: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి
మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లాల కలెక్టర్లతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర సిఎస్ శాంతి కుమారితో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహణకు హౌస్ లిస్టింగ్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు విజయవంతంగా పూర్తి చేసినందుకు అధికార యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.
హౌస్ లిస్టింగ్ కార్యక్రమంలో వచ్చిన ఇండ్ల సంఖ్య ఆధారంగా ప్రతి 150 ఇండ్లకు ఒక ఎన్యుమరేటర్, 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్ వైజర్ లను నియమించుకొని సర్వే చేపడుతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. 15 రోజుల పాటు నిరాటంకంగా సర్వే చేయాలని, ఒక కుటుంబాన్ని కూడా వదలకుండా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు.
సర్వే షెడ్యూల్ సంబంధించి ముందస్తుగా గ్రామాలలో వార్డులలో సమాచారం అందించాలని, ఏ సమయంలో సర్వే బృందాలు ఇండ్లకు వస్తాయో విస్తృతంగా ప్రచారం చేయాలని, సర్వే సమయంలో కుటుంబ సభ్యులు ఇంటి వద్ద అందుబాటులో ఉండే విధంగా ముందస్తు సమాచారం అందించాలని డిప్యూటీ సీఎం సూచించారు.
సర్వే సమయంలో ఇంటి వద్ద కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు వివరాలు రేషన్ కార్డ్ పట్టా పాస్ పుస్తకాల వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని డిప్యూటీ సీఎం ప్రజలను కోరారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల ఆర్థిక సామాజిక స్థితిగతులను తెలుసుకొని వారిని వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు సరైన పథకాల రూపకల్పన కోసం సమాచార సేకరణకు మాత్రమే ఈ సర్వే నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.
సర్వే నిర్వహణ సమయంలో ప్రజలు ఎక్కడైనా ఎందుకు సమాచారం సేకరిస్తున్నారని అడిగితే అధికారులు వివరించాలని, ఈ సర్వే కారణంగా ఎటువంటి ప్రభుత్వ పథకాలకు కోత విధించడం ఉండదని తెలియజేయాలని, ప్రజల అపోహలను దూరం చేసి సంపూర్ణ వివరాలు సేకరించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.
హౌస్ లిస్టింగ్ పూర్తయినందున నేటి నుంచి ఇంటింటికి తిరుగుతూ సర్వే ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. ప్రతి ఎన్యుమరేటర్ చేసిన సర్వేలో కనీసం 10 శాతం మేర ఇండ్లను సూపర్ వైజర్ క్రాస్ చెక్ చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. సర్వే వివరాలను ప్రతిరోజు ఎన్యుమరేటర్ల మండల స్థాయిలో తహసిల్దార్, ఎంపిడిఓ కార్యాలయాల వద్ద అప్పగించాలని తెలిపారు.
సర్వే వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని , ఎప్పటికప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వే వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులు విజయవంతంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం కోరారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రెవెన్యూ డివిజన్ అధికారులు గంగయ్య ,సురేష్ , జిల్లా పరిషత్ సీఈఓ, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రకాశ్,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App