TRINETHRAM NEWS

ఆత్మగౌరవం పార్టీ నినాదం…తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది

మహనీయుడి విజన్ టీడీపీ…

సంక్షేమ పథకాలను పరిచయం చేసింది టీడీపీనే

పార్టీనే ప్రాణంగా భావించే పసుపు సైన్యానికి పాదాభివందనం చేస్తున్నా

ఆటుపోట్లు, సవాళ్లు ఎదురైనా కార్యకర్తలు జెండా వదల్లేదు.. ప్రతి కార్యకర్త త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటా

పార్టీకి మనమంతా వారసులం.. పెత్తందారులం కాదు

83 రోజుల్లో కోటి సభ్యత్వాలు ఒక అసాధారణ రికార్డ్

ఎన్నికల హామీలన్నీ నెరవేర్చుతాం

-తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్‌కు నివాళి, అనంతరం కార్యకర్తలు, నేతలతో కలిసి జెండా ఎగురవేసిన సీఎం

Trinethram News : మంగళగిరి, మార్చి 29 : రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక పెను సంచలనమని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసమే టీడీపీ పుట్టిందన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ప్రపంచంలో ఒక్క తెలుగుదేశానికే దక్కిందని తెలిపారు. నాడు రాష్ట్రంలో పరిస్థితులు చూశాక హైదరాబాద్ వేదికగా తెలుగుదేశం పార్టీ పెడుతున్నట్లు ఎన్టీఆర్ ప్రకటకించారని గుర్తు చేశారు. టీడీపీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి వ్యవస్థాకులు ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. అనంతరం జెండా ఎగురవేసి కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు.

టీడీపీ స్థాపనకు ముందు రాజకీయాలంటే పెత్తందారీ వ్యవస్థ. చదువురాని వారిని ముందుపెట్టి కొందరు పెత్తనం చేసేవారు. విద్యావంతులను రాజకీయాల్లోకి తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. రాష్ట్రం బాగుండాలంటే యువరక్తం రావాలని ఆయన ఆలోచించారు. అప్పటివరకూ పాలనకే ప్రభుత్వాలు పరిమితం కాగా ఎన్టీఆర్ వచ్చాక సంక్షేమానికి శ్రీకారం చుట్టారు. తెలుగువారు ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుంది. మనందరం పార్టీకి వారసులమేగానీ పెత్తందారులం కాదు. ఎన్నో పార్టీలు వచ్చాయి… కనుమరుగయ్యాయి. అన్ని రాజకీయ పార్టీలకంటే టీడీపీ భిన్నగా పనిచేసింది కాబట్టే నిలబడింది. టీడీపీని లేకుండా చేస్తామని విర్రవీగినవారు కాలగర్భంలో కలిసిపోయారు. టీడీపీ స్థాపించిన ముహూర్తబలం, సంకల్పం చాలా గొప్పది. చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణయుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయి. 43 సంవత్సరాలుగా పార్టీకి ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం. సవాళ్లు అధిగమించామంటే అందుకు కార్యకర్తల అండదండలే కారణం. పార్టీయే ప్రాణంగా బతికే పసుపు సైనికులందరికీ మనస్పూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. ప్రజల కోసం చేసిన పనులే ఎన్టీఆర్‌ను యుగపురుషుణ్ణి చేశాయి.

తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం. ఎవరైనా చరిత్ర రాస్తే టీడీపీ ఆవిర్భావానికి ముందు తర్వాత అని రాయాలి. తెలుగువారిని అభివృద్ధి పథంలో నడిపించిన పార్టీ టీడీపీ. తెలుగు వారి ఆత్మవిశ్వాసం చాటిన జెండా టీడీపీ. తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన జెండా టీడీపీ. ఆడపడుచులకు అండగా నిలిచిన జెండా టీడీపీ. రైతుల వెన్నంటే ఉండి కన్నీరు తుడిచిన జెండా టీడీపీ. సామాజిక న్యాయం చేస్తున్న జెండా టీడీపీ. భావితరాలకు అండగా నిలిచే జెండా మన పసుపు జెండా. పసుపు జెండాకు ఒక విశిష్టత ఉంది. అన్నదాతలకు అండగా నాగలి, కార్మికులకు, పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా చక్రం, నిరుపేదలకు నీడ అందించేందుకు ఇల్లు… ఈ విశిష్టతలు మన జెండాలో మాత్రమే కనిపనిస్తాయి.

అప్పుడే పార్టీ స్థాపించి 43 ఏళ్లు గడిచిపోయాయా అనిపిస్తోంది. టీడీపీ వచ్చాకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు రాజకీయ అధికారం వచ్చింది. ఒకప్పుడు బీసీలంటే లెక్కలేనితనం ఉండేది. రాజకీయ గుర్తింపు ఉండేది కాదు. బీసీలంటే సమాజానికి వెన్నుముక అనే గుర్తింపు తెచ్చాం. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మరింత పైకి తెస్తాం. మొన్నటి ఎన్నికల్లో అన్న వర్గాలు, అన్ని కులాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తూ సీట్లు ఇచ్చాం. భవిష్యత్ లోనూ ఏ కులం కూడా మాకు అన్యాయం జరిగింది అనే మాట రాకుండా అందరికీ న్యాయం చేస్తాము. ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నాము.

నా ప్రాణసమానమైన తెలుగుదేశం కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నాను. ఆనాడు ఎన్టీఆర్ చైతన్యరథంతో వీధుల్లోకి వెళితే 9 నెలలు ఆయనకు అండగా రాత్రింబవళ్లు కార్యకర్తలు పనిచేశారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా 208 రోజులు, 2,817 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేస్తే నాకు అండగా నిలబడ్డారు. యువగళం పేరుతో నారా లోకేష్ 226 రోజులు, 3,112 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 2024లో అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యువగళానికి కార్యకర్తలు నీరాజనం పలికారు.

టీడీపీ ప్రాంతీయ పార్టీ మాత్రమే కాదు. జాతీయ భావాలు ఉండే దేశభక్తి కలిగిన పార్టీ అవకాశాలు మనకు వచ్చాయి. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్. యునైటడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం. ఎన్డీఏ 1, ఎన్డీఏ టూలో అలాగే ప్రస్తుతం కేంద్రంలోనూ టీడీపీ కీలకపాత్ర పోషిస్తోంది . దేశంలో మరే పార్టీకి దక్కని విధంగా పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ పనిచేసింది. బాబా సాహెబ్ అంబేద్కర్ కి భారతరత్న రావడంలో ఎన్టీఆర్ కీలకపాత్ర పోషించారు. విద్యుత్ సంస్కరణలు తెచ్చింది టీడీపీనే. మౌలిక సదుపాయాల్లోనూ సంస్కరణలకు నాంది పలికాం. విద్యా సంస్కరణలు తెచ్చాం. టీడీపీ ముందుచూపుతోనే సంపద సృష్టి సాధ్యమైంది. ఆనాడు టీడీపీ ప్రారంభించిన పనుల వల్ల దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

టీడీపీ మొదటినుంచి కార్యకర్తల కోసం ఆలోచించిన పార్టీ. ఒక కార్యకర్తను నడిరోడ్డుపై చంపినప్పుడు ఎంతో బాధపడ్డాను. నేను నిద్రపోని రోజులున్నాయి. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల పిల్లలను చదివించే బాధ్యత తీసుకున్నాం. ఎన్నో సవాళ్లు వచ్చాయి. 43 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణంలో మీ త్యాగాలు చూశాను. మీ కష్టాలు చూశాను. మీ ధైర్యసాహసాలు చూశాను. 2019- 24లో మీరు పడిన బాధలు చూశాను. మీ ఆస్తులను ధ్వంసం చేశారు. టీడీపీని వదిలేస్తే నీ ప్రాణం ఉంటుందని చంద్రయ్య మెడపై కత్తి పెట్టారు.. కానీ నా ప్రాణం పోయినా పర్లేదు టీడీపీ జెండా వదలను అని తుదిశ్వాస వదిలాడు. మీ త్యాగాలను నేను మరిచిపోలేను. గత పాలకులు విష సంస్కృతి తెచ్చారు. కార్యకర్తల త్యాగాలు గుర్తుంచుకుంటాం. నేను బయటకువస్తే కిలోమీటర్ల కొద్దీ పరుగెత్తిన కార్యకర్తలు ఉన్నారు. రాజకీయ కక్షలకు టీడీపీ దూరం. అదే సమయంలో మంచికి మంచి.. ఎవరైనా చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తాం. కార్యకర్తలు హుషారుగా ఉంటే టీడీపీకి ఓటమి లేదు. కార్యకర్తల్లో జోష్ తగ్గితే విపక్షాలకు కొమ్ములు వస్తాయి. కుటుంబ పెద్దగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. కార్యకర్త ఫస్ట్… నాయకుడు తర్వాత. నాయకులు వస్తుంటారు. కానీ కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారు. 83 రోజుల్లో కోటి సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ టీడీపీ. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్, పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావును మనస్పూర్తిగా అభినందిస్తున్నాను..

దగా పడ్డ ఏపీని నిలబెట్టి, రాష్ట్రాన్ని పునర్ నిర్మించాలని టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయి. 93 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం. మనపై ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అప్పులు చేసి సంక్షేమం ఇస్తే కొన్నాళ్లకు ఆగిపోతాయి. గత పాలకులు రూ.9 లక్షల 74 వేల కోట్ల అప్పులు మిగిల్చారు. అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. రూ.200 పింఛన్ రూ.2000 వేలకు పెంచాం. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఏడాదికి రూ.250 చొప్పున రూ.వెయ్యి పెంచదానికి ఐదేళ్ల సమయం తీసుకున్నారు. కానీ మనం అధికారంలోకి రాగానే ఒకేసారి రూ.3 వేలు నుంచి రూ.4 వేలకు పింఛను పెంచాం. దివ్యాంగుల పింఛను రూ.6000కు పెంచాం. డయాలసిస్ రోగులకు రూ.10000 ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15,000 ఇస్తున్నాం. ఇదంతా కేవలం మానవత్వంతోనే చేస్తున్నాం. పింఛన్లకు ఏడాదికి రూ.33వేల కోట్లు వెచ్చిస్తున్నాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం, దీపం 2 కింద ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఏప్రిల్ , మే నెలలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం అందిస్తాం. మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తాం. గత ఐదేళ్లలో నిలిపేసిన అమరావతి, పోలవరం పనులు తిరిగి ప్రారంభించాం.

ఓ వైపు సంక్షేమం, అభివృద్ధి చేస్తూనే రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నాము. రామాయపట్నంలో రూ.90 వేల కోట్ల వ్యయంతో బీపీసీఎల్ రిఫైనరీ వస్తోంది. నక్కపల్లిలో రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు ముందుకొచ్చింది. రూ.లక్షా 90 వేల కోట్ల పెట్టుబడితో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పెట్టబోతోంది. రూ.65 వేల కోట్లతో బయో ఫ్యూయల్ అందించేందుకు రిలయన్స్ ముందుకొచ్చింది. రేపు ఉగాది పండుగ రోజున పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ4 కు శ్రీకారం చుడుతున్నాం. ఆర్థికంగా బలమైన వారు పేదలను ఆదుకుని పైకి తీసుకురావాలి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telugu Desam, a party