సెప్టెంబర్ 9, 2026
TRINETHRAM NEWS
Telangana Language Day

Telangana Language Day : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 09, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్,లో తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భాషా యాస, సంస్కృతి, సాహిత్యానికి విశిష్ట గుర్తింపు తీసుకొచ్చిన ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి మాట్లాడుతూ, “తెలంగాణ భాష అనేది కేవలం మాట్లాడుకునే యాస మాత్రమే కాదు.. అది తెలంగాణ ప్రజల జీవన విధానానికి, సంస్కృతికి, ఆత్మగౌరవానికి ప్రతీక” అని అన్నారు. తెలంగాణ భాషలోని మాధుర్యం, సహజత్వం, జీవనానుభవం తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేశాయని పేర్కొన్నారు.

ప్రజాకవి కాళోజి నారాయణరావు తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచారని, తన రచనల ద్వారా సామాన్యుల కష్టాలను, ప్రజల ఆకాంక్షలను, సామాజిక సమస్యలను నిర్భయంగా వ్యక్తీకరించారని ప్రిన్సిపాల్ అన్నారు. “కాళోజి సాహిత్యం మనకు భాషను ప్రేమించడం మాత్రమే కాకుండా, సమాజాన్ని అర్థం చేసుకోవడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, మానవీయ విలువలను కాపాడుకోవడం నేర్పుతుంది” అని తెలిపారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో తెలంగాణ భాష, యాస, జానపద సంస్కృతి కొత్త తరాలకు చేరేలా విద్యార్థులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మాతృభాష పట్ల గౌరవం కలిగి ఉండటంతో పాటు, తెలంగాణ భాషలోని ప్రత్యేకమైన పదజాలాన్ని, సామెతలను, నుడికారాలను, జానపద సాహిత్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కాళోజి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ & తెలుగు విభాగాధిపతి జి కోటయ్య అకాడమిక్ కోఆర్డినేటర్ సి లింగమయ్య కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జి లింగారెడ్డి, తెలుగు అధ్యాపకులు అద్దంకి శ్రీను విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page