TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్: కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. మీడియా అకాడమీ చైర్మన్‌గా ఎవరిని నియమిస్తారంటూ జర్నలిస్టు వర్గాల్లో చర్చ జరుగుతున్నది.ఏ జర్నలిస్టు యూనియన్‌తో సంబంధాలు లేకుండా తటస్థంగా ఉండే సీనియర్ జర్నలిస్టును నియమించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశాన్ని పలువురు మంత్రుల దృష్టికి వ్యక్తిగతంగా కొద్దిమంది జర్నలిస్టులు తీసుకెళ్లారు. యూనియన్లతో సంబంధాలున్న వ్యక్తి చైర్మన్‌గా ఉంటే న్యూట్రల్‌గా ఆలోచించే అవకాశాలు ఉండకపోవచ్చని, సొంత యూనియన్ అభిప్రాయాలే నిర్వహణలోనూ ప్రతిబింబిస్తాయన్నది పాత్రికేయుల అనుమానం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని సంఘాల పట్ల సమాన దృక్పథంతో వ్యవహరించేలా, అందరినీ కలుపుకుపోయేలా ఉండే వ్యక్తిని నియమించడం సహేతుకంగా ఉంటుందన్నది వారి అభిప్రాయం.

మీడియా అకాడమీ చైర్మన్‌ను ప్రభుత్వం ఎప్పుడు నియమిస్తుందనే అంశం కొలిక్కి రాకపోయినా దాని నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఆలోచించి యూనియన్లలో యాక్టివ్‌గా లేని, నాయకత్వ బాధ్యతల్లో లేని వ్యక్తిని నియమించడం ద్వారా జర్నలిస్టులంతా స్వేచ్ఛగా వారి సమస్యలను, అభిప్రాయాలను షేర్ చేసుకునే వీలు ఉంటుందన్నది దీని ప్రధాన ఉద్దేశం. గత పాలనలో అల్లం నారాయణే అకాడమీ చైర్మన్‌గా కొనసాగారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఆయనే ఎక్స్ టెన్షన్ పేరుతో కంటిన్యూ అయ్యారు. ఒక యూనియన్‌కు ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఇతర యూనియన్లు అకాడమీని సంప్రదించడానికి ఆసక్తి చూపలేదు. కొత్త ప్రభుత్వంలోనూ ఇదే ట్రెండ్ కొనసాగరాదన్న భావనతో మంత్రుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్ళారు. యావత్తు జర్నలిస్టు కమ్యూనిటీ సంతృప్తి చెందేలా ప్రభుత్వం చైర్మన్ నియామకం విషయంలో ఆలోచించాలని మంత్రులను కోరుతున్నారు.

అక్రెడిటేషన్ కార్డులు, గృహ వసతి (ఇండ్ల స్థలాల), చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలోనే యూనియన్ లీడర్లతో సమావేశం నిర్వహిస్తామని సమాచార పౌర సంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల పలు సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టుల సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉండి, అన్ని సంఘాల పాత్రికేయుల విశ్వాసాన్ని చూరొగనేలా, యూనియన్ యాక్టివిటీస్‌లో నాయకత్వ బాధ్యతల్లో లేని, న్యూట్రల్‌గా ఉండే సీనియర్ జర్నలిస్టును చైర్మన్‌గా నియమించడం ద్వారా ప్రభుత్వం ఆశించిన లక్ష్యంతో పాటు సమస్యలకు తగిన పరిష్కారం లభించే అవకాశం ఉందన్నది జర్నలిస్టుల అభిప్రాయం.