
Trinethram News : అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కస్టడీలో హింసించిన కేసులో సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి సీరియస్ అయింది.
ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఓ డాక్టర్ ను విచారణకు హాజరు కాకపోతే గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ కేసులో పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని ఆమెకు స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టు హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.
గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజును సీఐడీ పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆయనపై దాడి చేశారు. ఆ తర్వాత రఘురామకు గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. వీటిలో ఆయనకు ఎలాంటి గాయాలు లేవంటూ జీజీహెచ్ సూపరింటెండెంట్ గా ఉన్న ప్రభావతి రిపోర్టును మార్చి ఇచ్చారు. దీంతో పోలీసులు కూడా ఈ రిపోర్టు ఆధారంగా రఘురామ బెయిల్ ను సుప్రీంకోర్టులో వ్యతిరేకించారు. కానీ సుప్రీంకోర్టు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వైద్యులతో పరీక్షలు చేయించి ఆయనపై దాడి జరిగినట్లు తేల్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా రఘురామరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు డాక్టర్ ప్రభావతిని అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమె సుప్రీంకోర్టు వరకూ వెళ్లి అరెస్టు కాకుండా రక్షణ పొందారు. కానీ పోలీసుల విచారణకు మాత్రం హాజరు కావడం లేదు. దీంతో పోలీసులు తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రభావతిని ఈ నెల 7,8 తేదీల్లో పోలీసుల విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. విచారణకు సహకరించకపోతే ఆమెకు గతంలో అరెస్టు కాకుండా ఇచ్చిన రక్షణను రద్దు చేయాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
