Trinethram News : వారణాశిలోని జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీం కీలక తీర్పునిచ్చింది. జ్ఞానవాపి మసీదు దక్షిణ వైపు సెల్లార్లో చేస్తున్న పూజలపై స్టేకు సుప్రీంకోర్టు నో చెప్పింది. అంతేకాదు అక్కడ పూజలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దక్షిణ భాగంలోని సెల్లార్లో చేస్తున్న పూజల వలన ఉత్తర భాగంలోని ముస్లింలు చేసుకునే ప్రార్థనలపై ఎటువంటి ప్రభావం చూపించదని తాము భావిస్తున్నట్లు సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు.
కాశీ జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. మసీదులోని సెల్లార్లో హిందువుల పూజలు చేసుకోవచ్చన్న అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
రెండు వర్గాల వారు మతపరమైన ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా జ్ఞానవాపి ప్రాంగణంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది.
జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో చివరి తీర్పు వచ్చే వరకు ఇవే ఆంక్షలు అమలు చేయాలని అధికారులను సుప్రీం కోర్టు ఆదేశించింది.
అయితే మసీదు ఆవరణలో హిందువులు పూజలు చేసుకునే అంశంలో మాత్రం ప్రస్తుతానికి యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు వెల్లడించింది. ఇక మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసేందుకు అనుమతి నిరాకరించాలన్న మసీదు కమిటీ పిటిషన్‌ను ఫైనల్‌గా జులైలో విచారిస్తామని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.