State Deputy Chief Minister Mallu Bhatti Vikramarka will build an 800 mega watt power plant
*ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు కృషి
*సింగరేణి కార్మికులకు కోటి రూపాయలు, కాంట్రాక్ట్ కార్మికులకు 30 లక్షల బీమా కల్పించాం
*పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన నిధులు తాజా బడ్జెట్ లో కేటాయించాం
*2035 నాటికి గరిష్ట విద్యుత్ డిమాండ్ 31 వెల మెగా వాట్ల అంచనా తో నూతన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు
*పీఏం కుసుమ్ పథకం క్రింద మహిళా సంఘాల ప్రాదాన్యత కల్పిస్తూ మరో 4 వేల మెగా వాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు
*నెల రోజుల వ్యవధిలో రూరల్ టెక్నాలజీ సెంటర్ రామగుండంలో ఏర్పాటు
*రామగుండం నగరం పరిధిలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
పెద్దపల్లి, ఆగస్టు-31: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశాన్ని ప్రజా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి 800 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ ను నిర్మించాలని నిర్ణయించిందని, తెలంగాణ జెన్ కో సింగరేణి సంయుక్తంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
శనివారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రామగుండం నగరంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర బీసి,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష లతో పాటు విస్తృతంగా పర్యటించారు.
జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బృందాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఘనంగా స్వాగతం పలికారు.
రామగుండంలోని 800 మెగా వాట్ల టీజీ విద్యుత్ ప్లాంట్ స్థలం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బృందం సందర్శించారు. అనంతరం సెక్టార్ 2 వద్ద 3 కోట్లతో నిర్మించిన నైపుణ్య కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమృత్ 2.0, టి.యూ.ఎఫ్.డి. ఐ.సి క్రింద చేపట్టే పలు అభివృద్ధి పనులకు, సింగరేణి ఆధ్వర్యంలో 5 కోట్ల నిధులతో 23 కిలోమీటర్ల అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రామగుండం ప్రజల అభీష్టం మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజా ప్రభుత్వం రామగుండంలో 800 మెగా వాట్ల పవర్ ప్లాంట్ నిర్మిస్తామని డీప్యూటీ సీఎం ప్రకటించారు. సింగరేణి, తెలంగాణ జెన్ కో సంయుక్తంగా ఈ పవర్ ప్లాంట్ నిర్మిస్తాయని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అవసరమైన భూమి ఇతర సౌకర్యాల కల్పనకు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు సహకరించి ఎంత తొందరగా ప్రతిపాదనలు పంపితే అంత తొందరగా పవర్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని, పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి ఆమోదింపజేసుకొని సూత్ర ప్రకటనకు నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
1971 లో ఏర్పాటుచేసిన రామగుండం ఆర్.టి.ఎస్ బీ బ్లాక్ 50 ఏళ్లపాటు ఈ రాష్ట్రానికి దేశానికి సేవలు అందించి సాంకేతిక కారణాలతో మూసి వేయాల్సి వచ్చిందని, ఈ ప్రాజెక్టుతో స్థానిక ప్రజలకు ఉన్న భావోద్వేగాలను గుర్తించి ఇక్కడే పవర్ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రామగుండంలో పవర్ ప్లాంట్ నిర్మిస్తామని నాడు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగిందని, నేడు ఆ హామీ అమలు దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. 2500 కోట్లు ఖర్చు చేసి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరింపజేసామని, పేదలందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు.
ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మొత్తం 4.5 లక్షల ఇండ్లను మంజూరు చేశామని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి , రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు బృందం అమెరికా దక్షిణ కొరియా దేశాలలో పర్యటించి రాష్ట్రానికి దాదాపు 36 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొని వచ్చిందని , వీటి ద్వారా స్థానికంగా తెలంగాణ యువతకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాలు అందించాలని లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారం ప్రభుత్వంలోని ఖాళీలను భర్తీ చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8 నెలల కాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ పథకం అమలు చేశామని అన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా సింగరేణి కార్మికులకు కోటి రూపాయలు ,కాంట్రాక్ట్ కార్మికులకు 30 లక్షల రూపాయల భీమా కల్పించామని అన్నారు.
ప్రజల శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం పట్ల కొందరు సామాజిక మాధ్యమాలలో అసత్యాలు ప్రచారం చేయాలని చూస్తున్నారని, దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గతం కంటే విద్యుత్ డిమాండ్ గరిష్టంగా పెరిగినప్పటికీ నిరంతరాయ విద్యుత్ సరఫరా చేశామని అన్నారు.
2031 నాటికి గరిష్టంగా తెలంగాణ ప్రాంతానికి 27 వేల 59 మెగా వాట్లు, 2034-35 నాటికి 31 వేల 809 మెగా వాట్ల పైగా విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని , థర్మల్, సోలార్, హైడల్, పంప్ స్టోరేజ్, ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు చేస్తామని, విద్యుత్ సర్ ప్లెస్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ఉపముఖ్యమంత్రి తెలిపారు.
పిఎం కుసుమ్ కింద తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ఇందులో ప్రత్యేకంగా రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. డ్వాక్రా మహిళా సంఘాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రాబోయే 5 సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తామని అన్నారు.
ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ జారీ చేశామని, వీటిలో పాల్గోనే నిరుద్యోగ యువతీ యువకులు కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అన్నారు. గతంలో గురుకులాల కోసం మూడు కోట్ల రూపాయల కేటాయిస్తే, నేడు ప్రజా ప్రభుత్వం యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణానికి బడ్జెట్లో 5 వేల కోట్లు కేటాయించిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
రామగుండం స్థానిక ఎమ్మెల్యే కోరిన విధంగా పాలకుర్తి ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తామని, సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల అంశాన్ని పరిశీలించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని , అవసరమైన చోట అదనపు ట్రాన్స్ ఫార్మర్, సబ్ స్టేషన్, విద్యుత్ పోల్స్ మంజూరు చేస్తామని, ఆర్ &ఆర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. పాలకులుగా కాకుండా సేవకులుగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత 8 నెలల నుంచి రామగుండం అభివృద్ధి గురించి స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ వహించారని, ముఖ్యంగా రామగుండం బీ పవర్ హౌస్ థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం కోసం కృషి చేశారని అన్నారు.
రామగుండం లోని స్థానిక ప్రజలకు ఉపాధి అందించాలని ఉద్దేశంతో 8 వేల పై చిలుకు కోట్లతో 800 మెగా వాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని మంజూరు చేయడం జరిగిందని అన్నారు.
నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని, ఒక నెల రోజుల లోపు 100 మందికి ఉపాధి కల్పించే రూరల్ టెక్నాలజీ సెంటర్ అనే సాఫ్ట్ వేర్ సంస్థను రామగుండంలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా పెద్దపల్లిలో సుల్తానాబాద్ వద్ద కూడా రూరల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు 10 ఎకరాల స్థలం గుర్తించామని తెలిపారు.
ప్రభుత్వ రంగంలోనే ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది, అదే సమయంలో ప్రైవేటు ఉపాధి అవకాశాలు మన యువత అందుకునే విధంగా వారికి అవసరమైన శిక్షణ కల్పించేందుకు సింగరేణి ఆధ్వర్యంలో స్కిల్ సెంటర్ ప్రారంభించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు.
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని, సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని, వీటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుందని ,ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
గోదావరిఖని పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు సింగరేణి ఖాళీ స్థలాన్ని సేకరించి మొదటి సంవత్సరం 3500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మించి అందిస్తామని, దీనిని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. గతంలో దివంగత నేత వైయస్సార్ హయాంలో సింగరేణి ప్రాంతంలో 20 వేల పట్టాలు పంపిణీ చేశామని, మరో 4 ,5 వేల మంది భూముల రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసి రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రామగుండం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో రామగుండం లోని సింగరేణి కార్మికులు పోషించిన పాత్ర ప్రత్యేకమైందని, అటువంటి రామగుండం ప్రాంతాన్ని గత పాలకులు ఆశించిన మేర అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం డిప్యూటీ సీఎం, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి పదవికి చోరువతో భారీ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటు న్నామని అన్నారు.
రామగుండం శాసనసభ్యులు కోరిన విధంగా ఈ ప్రాంతానికి త్వరలోనే అదనంగా బస్సులు కేటాయించడం జరుగుతుందని అన్నారు. మహాలక్ష్మి పథకం క్రింద ప్రభుత్వం ఇప్పటివరకు 2500 కోట్లు ఖర్చు చేసి ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించిందని అన్నారు.
అనంతరం 211 మహిళా సంఘాలకు 23 కోట్ల 35 లక్షల 50 వేల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను డిప్యూటీ సీఎం పంపిణీ చేశారు
అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బృందం మంచిర్యాల జిల్లా పర్యటనకు బయలు దేరారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సింగరేణి చైర్మన్ ఎన్. బలరాం, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు,గడ్డం వివేక్, గడ్డం వినోద్, ప్రేమ్ సాగర్ రావు, రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, అదనపు కలెక్టర్ లు జే.అరుణ శ్రీ, జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, ఆర్డిఓలు బి.గంగయ్య, వి.హనుమా నాయక్, సింగరేణి అధికారులు, విద్యుత్ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App