TRINETHRAM NEWS

Skyrocketing prices of vegetables and onions

Trinethram News : సహజంగా వేసవి రాగానే కూరగాయల ధరలు పెరుగుతాయి. వర్షాకాలం ప్రారంభం కాగానే ధరలు కాస్త తగ్గుతాయి. కానీ ఈ సంవత్సరం అందుకు భిన్నంగా ఎండాకాలం ధరలు నామమాత్రంగా పెరిగి, వర్షాకాలం మొదట్లో ధరలు అమాంతం చుక్కలను తాకుతున్నాయి.

ఉల్లిపాయల నుంచి కూరగాయల వరకు అన్ని ధరలు పెరగడంతో సామాన్యుల పరిస్థితి దారుణంగా తయారయింది.

కూరగాయలు, ఉల్లిపాయలు కొనలేని ధరలు

ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ సామాన్యులు కూరగాయలను, ఉల్లిపాయలను కొనాలంటే లబోదిబోమంటున్నారు.ప్రస్తుతం దాదాపు అన్ని కూరగాయల ధరలు కిలో 80 రూపాయల వరకు పలుకుతున్నాయి. 15 రోజుల వ్యవధి లోనే ఉల్లిపాయలు, టమాట సహా అన్ని కూరగాయల ధరలు 60 శాతం వరకు పెరిగాయి. డిమాండ్ కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది.

అమాంతం పెరిగిపోయిన కూరగాయల ధరలు

మే నెల మూడో వారంలో 20 రూపాయలు పలికిన ఉల్లిపాయల ధరలు, కిలో ప్రస్తుతం 50 రూపాయలకు చేరింది. టమాటా ధర కూడా ప్రస్తుతం కిలో 50 రూపాయలకు పైనే పలుకుతుంది. ఇక క్యారెట్, వంకాయలు, బీన్స్, బీరకాయలతో పాటు ఆకుకూరల ధరలు కూడా అమాంతం పెరిగాయి. తెలంగాణ జనాభాకు ప్రతి ఏడాది 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరమవుతాయి.

తెలంగాణాలో డిమాండ్ కు తగ్గటు లేని కూరగాయల ఉత్పత్తి

అయితే ప్రస్తుతం 19.54 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్న పరిస్థితి ఉంది. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి రావడం కారణంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలలో బాగా పెరిగిన కూరగాయల ధరలు, ఉల్లిపాయల ధరలు కూరగాయలు కొనాలంటే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

ధరాఘాతం శరా ఘాతంగా

ప్రస్తుతం నిత్యవసర వస్తువుల ధరలతో పాటు, కూరగాయల పైన కూడా పడుతున్న ధరాఘాతం సామాన్యులకు శరాఘాతంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం కొండెక్కి కూర్చున్న కూరగాయలు, ఉల్లిపాయల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం సామాన్యుల నుండి వ్యక్తం అవుతుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App