ఆగస్ట్ 18, 2026
TRINETHRAM NEWS
Sardar Sarvai Papanna Goud

Sardar Sarvai Papanna Goud : కూకట్పల్లి ఆగస్టు 18 (త్రినేత్రం న్యూస్) : బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ వద్ద గల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి గౌరవ తాజా మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, శ్రీ నార్నె శ్రీనివాసరావు మరియు గౌడ సోదరులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని పూలమాల వేసి ఘన నివాళులర్పించిన గౌరవ పి ఏ సి ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ. సందర్భంగా పిఎసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ.. సుమారు 376 సంవత్సరాల క్రితం, అంటే 1650 ఆగస్టు 18న తెలంగాణ గడ్డపై జన్మించిన మహోన్నత వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడు కి ఘన నివాళులర్పిస్తున్నాం అని గాంధీ తెలియచేశారు.
ఆయన పోరాట స్ఫూర్తి, సామాజిక న్యాయం, రాజ్యాధికార చైతన్యంపై ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని మనిషికి గౌరవం ఉండాలి…! అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలి…! అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పించాలి…! అధికారంలో అందరికీ భాగస్వామ్యం ఉండాలి. అందుకే నేటికీ బహుజన సమాజానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక చారిత్రక వీరుడు మాత్రమే కాదు; ఆత్మగౌరవానికి ప్రతీక, సామాజిక న్యాయానికి స్ఫూర్తి, సమానత్వానికి చిహ్నం అని పిఎసి చైర్మన్ గాంధీ తెలిపారు. అణగారిన వర్గాల మధ్య నుంచి ఎదిగి, వారినే తన పోరాట శక్తిగా మలుచుకుని తెలంగాణ నేలపై స్వీయ పాలనకు పునాది వేసిన అసాధారణ ప్రజా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సుమారు మూడున్నర శతాబ్దాల క్రితమే సామాజిక అసమానతలు, దోపిడీ, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన పాపన్న ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ఒక చారిత్రక తిరుగుబాటు. సామాన్యుడి నుంచి నాయకుడిగా, యోధుడిగా, పాలకుడిగా ఎదిగి తన కాలంలోని అధికార వ్యవస్థను సవాలు చేసిన ప్రజా వీరుడు అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేశారు.
గోల్కొండతో సహా అనేక కోటలపై తన ప్రభావాన్ని స్థాపించిన పాపన్న సైనిక ప్రతిభతో పాటు తన కాలంలోని రాజకీయ వ్యవస్థలను సవాలు చేసిన నాయకుడిగా చరిత్రలో నిలిచారు. ఆయనతో అనుబంధం ఉన్న ఖిలాషాపూర్ కోటను చారిత్రక వారసత్వ కట్టడంగా అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టడం కూడా ఆయన చారిత్రక ప్రాధాన్యతకు నిదర్శనం అని గాంధీ తెలియచేశారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ని స్మరించుకోవడం అంటే కేవలం జయంతి వేడుకలు నిర్వహించడం కాదు. ఆయన ఆశయాలను అర్థం చేసుకోవాలి. ఆయన ఆత్మగౌరవాన్ని ఆచరణలో పెట్టాలి. ఆయన ఐక్యతా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన గౌరవం కల్పించాలి. ప్రజాస్వామ్య పద్ధతుల్లో సామాజిక న్యాయం కోసం కృషి చేయాలి. సమాజంలో ఉన్న ప్రతి కులానికి సమన్యాయం దక్కాలి.

ప్రతి వర్గానికి సమాన గౌరవం దక్కాలి. ప్రతి అర్హుడికి సమాన అవకాశం దక్కాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి వర్గానికి తగిన ప్రాతినిధ్యం దక్కాలి. ఇదే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను స్మరించుకోవడానికి సరైన మార్గం అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేశారు.పాపన్న పోరాటంలో గోల్కొండ ఘట్టం అత్యంత కీలకమైనది. ఆ కాలంలో గోల్కొండ ఒక ప్రధాన రాజకీయ, సైనిక అధికార కేంద్రం. సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి తన ప్రజాబలంతో ఎదిగి గోల్కొండను సవాలు చేయడం పాపన్న పోరాటంలోని అసాధారణతను తెలియజేస్తుంది. పాపన్న ప్రభావం విస్తరిస్తున్న కొద్దీ అప్పటి మొఘల్ అధికార వ్యవస్థకు ఆయన ఒక సవాలుగా మారాడు. స్థానిక అధికార కేంద్రాలపై తన ప్రభావాన్ని పెంచుకుంటూ స్వతంత్ర శక్తిగా ఎదగడం మొఘల్ పాలకులకు ఆందోళన కలిగించింది. పాపన్నపై ఎన్ని సైనిక చర్యలు, కోటలపై దాడులు జరిగినా, తిరిగి శక్తిని సమీకరించుకున్న తీరు ఆయన పోరాట స్ఫూర్తికి నిదర్శనం. ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా తన పోరాటాన్ని కొనసాగించాడు అని, పాపన్న జీవితం ఎంతో మందికి స్పూర్తి దాయకం ,నేటి యువత కు ఆదర్శం అని గాంధీ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు , మాజీ కార్పొరేటర్లు, శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం సభ్యులు ,గౌడ సోదర సోదరీమణులు, నాయకులు,కార్యకర్తలు ,అబిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page