Revanth’s 99-day Plan : రేవంత్ 99 రోజుల ప్రణాళిక

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణలో ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లేందుకు రేవంత్ 99 రోజుల ప్రణాళిక సిద్ధం చేశారు. పాలనను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ద్వారా ప్రజల్లో పట్టు సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో నలుగురు మంత్రులతో కూడిన ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ ప్రతి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను గుర్తించి, వాటిని 99 రోజుల్లోపు పూర్తి చేసేలా ఒక బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రులందరూ జిల్లాల్లో పర్యటించి, అభివృద్ధి పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షించనున్నారు.

ఈ 99 రోజుల ప్లాన్‌లో ప్రధానంగా ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత వంటి పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరవేసేలా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించనున్నారు. గ్రామాల్లో డ్రైనేజీలు, సిమెంటు రోడ్లు, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక నిధులను కేటాయించి గరిష్టంగా పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను తామే పూర్తి చేస్తున్నామనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా చూసుకోవాలని ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మండల, జిల్లా పరిషత్‌లను టార్గెట్ చేసుకుని ఈ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా భావిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Revanth's 99-day plan

You cannot copy content of this page

Scroll to Top