Trinethram News : 7th Jan 2024
తెలంగాణపై నిజమైన ప్రేమ ఉన్న పార్టీలు సోనియా గాంధీ పై పోటీ చేయోద్దు
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని ఈ విధంగా తీర్చుకుందాం
బిజెపి, బీఆర్ఎస్ కుమ్మక్కవ్వడం వల్లే కాలేశ్వరంపై చర్యలు లేవు
బిజెపి నోటికొచ్చినట్టుగా బాధ్యత లేకుండా మాట్లాడటం సరికాదు
పారదర్శకంగా జవాబుదారీగా ప్రజాపాలన అందిస్తున్నాం
చిన్నా భిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం
“తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారిని మన రాష్ట్రం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని కోరినాము.
సోనియా గాంధీ పోటీ చేసే పార్లమెంటు స్థానం నుంచి తెలంగాణపై నిజమైన ప్రేమ ఉన్న ఏ పార్టీలు పోటీ చేయోద్దు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవాలని” డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి ఆదివారం భట్టి విక్రమార్క దంపతులు వచ్చారు. వారి వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న బట్టి విక్రమార్క తల్లిదండ్రులైన అఖిలాండ దాసు, మాణిక్యమ్మల ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులు అర్పించారు. దీనికి ముందు గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర ఆలయంలో భట్టి దంపతులు శివుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం విస్తరణ కోసం దేవాదాయ ధర్మా దాయశాఖ అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం చర్చించారు. గుడి బయట కళ్యాణమండపం డార్మెంటరీ స్నానాల ఘట్టం నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం స్థానిక విలేకరులతో 30 రోజులు పూర్తి చేసుకున్న ప్రజాపాలన గురించి ఆయన మాట్లాడారు.
బిఆర్ఎస్ పార్టీకి కాలేశ్వరం ఏటీఎం లాగా మారిందని ప్రధాన మంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా లు తెలంగాణకు వచ్చిన సందర్భంగా ప్రతిసారి వ్యాఖ్యలు చేశారు.
కాలేశ్వరం నిర్మాణంలో దోపిడీ జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీలు ఇచ్చిన సమాచారం ప్రకారమే మోడీ, అమిత్ షా లు మాట్లాడిన వారు కాలేశ్వరం దోపిడి గురించి పూర్తి సమాచారం ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బిఆర్ఎస్ కేంద్రంలోని బిజెపి కుమ్మకు కావడం వల్లనే కాలేశ్వరం పై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టు పై జరిగిన దోపిడి గురించి సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్ర బిజెపి నాయకులు వారి కేంద్ర నాయకత్వానికి ఆ విషయమే చెప్పాలని అన్నారు. కేంద్రంలో ఉన్న సిబిఐ ఇతర దర్యాప్తు సంస్థలు ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో పనిచేస్తాయి కాబట్టి తాము సిబిఐ విచారణకు కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఇవన్నీ విషయాలు తెలిసినప్పటికీ
రాష్ట్ర బిజెపి నాయకులు బాధ్యత లేనట్టుగా నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని చురకలు వేశారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షల నగదు జమ, నోట్ల రద్దు సమయంలో బయటికి తీస్తానన్న నల్లధనం ఏమైందని వీటిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోసం మోసమని బతికే బిజెపి లాగా కాంగ్రెస్ వ్యవహరించదని అన్నారు.
పారదర్శకంగా జవాబుదారీగా ప్రజాపాలన
రాష్ట్రంలో చిన్న భిన్నంగా ఉన్న పాలన వ్యవస్థను గాడిలో పెట్టి జవాబుదారి పాలన అందిస్తున్నామని చెప్పారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగులు 21వ తారీకు వరకు జీతాలు తీసుకున్న దుస్థితి నుంచి మొదటి వారంలోనే జీతాలు ఇచ్చే ఆర్థిక స్థితికి మెరుగు పరిచామన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అరాచకత్వంపై శ్వేత పత్రం విడుదల చేసి ప్రజలకు ఆర్థిక పరిస్థితులపై వాస్తవాలు చెప్పామని వివరించారు.
విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా జెన్కో,
ట్రాన్స్ కో, డిస్కోలో ఉన్న అప్పులను బయట పెట్టడంతో పాటు
వ్యవసాయ శాఖలో సమీక్ష చేసి ప్రజలకు జవాబుదారీగా భూసార పరీక్షలు పెంచి రైతులకు అధికార యంత్రాంగాన్ని అందుబాటులో ఉండే విధంగా సమయాత్తం చేశామన్నారు.
కాలేశ్వరం కార్పొరేషన్ పేరిట లక్ష కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అధోగతి పాలు చేసిన కాలేశ్వరం గురించి వాస్తవాలను
బయటపెట్టి జ్యుడీషియల్ విచారణకు సిద్ధమయ్యామని చెప్పారు. మిషన్ భగీరథలో జరిగిన అవకతవకలపై నివేదిక తయారవుతున్నదని త్వరలో బయట పెడతామని వెల్లడించారు
పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసి రాష్ట్ర ప్రజలకు అతి పెద్ద సవాల్ గా మారిన డ్రగ్స్ నిరోధానికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఆ శాఖకు కావాల్సిన నిధులను మంజూరు చేశామని తెలిపారు. 6 గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకంలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు 6.50 కోట్ల మహిళలకు లబ్ధి కలిగించామని చెప్పారు
ఆరోగ్య శ్రీ సాయాన్ని పది లక్షల రూపాయలకు పెంచి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. విద్యా, వైద్య ఉపాధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని,
గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ప్రణాళిక సంఘాన్ని తిరిగి పునరుద్ధరణ చేసి,
ఆ శాఖకు సీనియర్ ఐఏఎస్ అధికారిని సెక్రటరీగా నియమించాని చెప్పారు.
ఆర్దిక వనరులను సక్రమంగా ప్రణాళిక బద్ధంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే వెచ్చిస్తామన్నారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని,
పైరవీలు, ప్రశ్న పత్రాలు లీకు కాకుండా పకడ్బందీగా టిఎస్పిఎస్సి ద్వారా పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టామన్నారు.
నిరుద్యోగ యువతకు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అనుగుణంగా పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ రంగంపై లోతైన అధ్యయనం చేసి ఇంక్లూసివ్ గ్రోత్లోకి ప్రజలను తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నదని తెలిపారు.
రాష్ట్రంలో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ఒత్తిడి లేని పాలన అందిస్తామని చెప్పినట్టుగానే చేస్తున్నామని తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణకు కఠినంగా వ్యవహరించడమే కాకుండా ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతగా గుర్తించి అందుకు తగ్గట్టుగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
పైరవీకారులు, తాబేదారులకు తావు లేకుండా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా 30 రోజులు ప్రజాపాలన అందించిందని వెల్లడించారు.
ప్రజలు ఇచ్చిన ఈ పదవులను హోదా గా కాకుండా బాధ్యతగా స్వీకరించి పారదర్శకంగా జవాబుదారీగా ప్రజాపాలన అందిస్తున్నట్లు చెప్పారు.
ఆరు గ్యారెంటీల హామీల అమలుకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించామన్నారు.
రాష్ట్రంలో విద్యా, వైద్యం బలోపేతం చేయడానికి ప్రత్యేక దృష్టి సారించామని,
ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేసి విద్యార్థులందరికీ ప్రపంచీకరణలో భాగంగా పెరుగుతున్న పోటీ తత్వాన్ని ఎదుర్కొనే విధంగా వృత్తిపరమైన కోర్సులు తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, తదితరులు