
Outdated Buses : అరకు లోయ సెప్టెంబరు 01, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అరకు, ఇతర ప్రాంతాలకు నడుపుతున్న ఆర్టీసీ బస్సులు కాలం చెల్లి తరచూ మార్గమధ్యలో మొరాయిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆదివాసీ గిరిజన మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు వి.వి. జయ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎప్పుడు, ఎక్కడ బస్సు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆమె పేర్కొన్నారు. బస్సులు మార్గమధ్యలో నిలిచిపోవడంతో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు గమ్యస్థానాలకు ఎలా చేరుకోవాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.
ఇటీవల అరకు వైపు వెళ్లాల్సిన చివరి బస్సు పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకోకముందే మార్గమధ్యలో మరమ్మతులకు గురై నిలిచిపోయిందని తెలిపారు. దీంతో బస్సు పాడేరు చేరుకునే సమయానికి రాత్రి 9 గంటలు అయిందన్నారు. అక్కడి నుంచి రాత్రి 9.30 గంటలకు బస్సును తీసుకెళ్లినా నెమ్మదిగా ప్రయాణిస్తూ అరకు చేరుకునేసరికి రాత్రి 11 గంటలు అయిందని చెప్పారు. ఈ సమయంలో చంటి పిల్లలతో ఉన్న తల్లులు, వృద్ధులు, కళాశాల నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులు సహా అనేకమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.
ఎన్నో సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ ఆర్టీసీ అధికారులు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని వి.వి. జయ విమర్శించారు. కాలం చెల్లిన, తరచూ మరమ్మతులకు గురయ్యే బస్సుల స్థానంలో మెరుగైన బస్సులను కేటాయించాలని, పాడేరు నుంచి అరకు, ఇతర మార్గాల్లో బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.
ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బస్సుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. సమస్యను పరిష్కరించకపోతే ప్రయాణికుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆదివాసీ గిరిజన మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు వి.వి. జయ హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe