TRINETHRAM NEWS

Machilipatnam : సముద్రంలో కొట్టుకుపోయిన ఐదుగురు ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్, ఒకరు మృతి..

మచిలీపట్నం : ఇవాళ (ఆదివారం) సెలవురోజు కావడంతో కొందరు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. నీటిలోకి దిగి సముద్ర అలలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు..

ఇంతలోనే వారి ఆనందంపై ఓ రాకాసి అల నీరుచల్లింది. అలల తాకిడికి యువకులు సముద్రంలోకి కొట్టుకుపోవడం గమనించిన మెరైన్ పోలీసులు నలుగురికి కాపాడారు. కానీ ఓ విద్యార్థి మాత్రం సముద్రంలో గల్లంతయ్యాడు..

మెరైన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదివుకునే తోకల అఖిల్ మరో నలుగురు స్నేహితులతో కలిసి ఇవాళ మచిలీపట్నం వెళ్లాడు. స్నేహితులంతా కలిసి తాళ్ళపాలెం బీచ్ లో సరదాగా గడుపుతుండగా ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. నీటిలోకి దిగిన ఐదుగురు యువకులను అలలు సముద్రపు లోతుల్లోకి లాక్కెల్లిపోయాయి..

యువకులు కొట్టుకోపోవడం గమనించిన మెరైన్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సముద్రంలోకి దిగిన పోలీసులు ఎంతో కష్టపడి కొట్టుకుపోతున్న నలుగురు యువకులను ప్రాణాలతో కాపాడారు. కానీ అఖిల్ ను మాత్రం రక్షించలేకపోయారు. అతడి కోసం ఎంత ప్రయత్నించినా జాడ కనబడలేదని మెరైన్ పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు మెరైన్ ఎస్సై సుభాష్ చంద్రబోస్ తెలిపారు..