TRINETHRAM NEWS

ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ట కాబోయే రాములవారి గుడి అయోధ్యకు లక్ష తిరుపతి లడ్డూలు… రూ.30 లక్షల నెయ్యి విరాళం ఇచ్చిన టీటీడీ సభ్యుడు

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైనదివ్యక్షేత్రం తిరుమల. శ్రీ శ్రీనివాసుడు ఎంతటి నైవేద్య ప్రియుడో… అంతటి భక్త ప్రియుడు కూడా. అందుకే ఆద్యంతం తిరుమల భక్త జన సందోహంగా ఉంటుంది. నిత్యం గోవింద నామాలతో తిరుగిరులు మారుమ్రోగుతూనే ఉంటాయి. త్రేతాయుగంలో రాముడైనా ఆ పరంధామ, కలియుగంలో ఆ శ్రీ వెంకటేశ్వరుడు అని ఎన్నో పురాణ ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి. ఎన్నో అవరోధాలు అనంతరం రామజన్మ భూమి అయోధ్యలో పితృవాక్య పరిపాలన గావించిన శ్రీ రామ చంద్రమూర్తి ఆలయం అత్యంత వైభంగా తీర్చిదిద్దారు కళాకారులు.

జనవరి 22వ తేది శ్రీరామ చంద్రుడు ఆలయంలో అర్చవతార మూర్తిగా ప్రతిష్టించేందుకు సర్వం సిద్దం అయ్యింది. స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనకు శ్రీవారి లడ్డు ప్రసాదం ప్రత్యేక ఆకర్షణగా, ప్రత్యేక ప్రసాదంగా పంచేందుకు ఆలయ కమిటీ సంసిద్ధం అయ్యింది. టీటీడీ సైతం లడ్డూల పంపిణీ ప్రక్రియకు సర్వం సిద్దం చేస్తుంది. ముందుగా 175 గ్రాముల సాధారణ లడ్డూలను పంపాలని టీటీడీ యోచించింది. రవాణా సైతం కష్టంగా మారి లడ్డూ బూందిగా మారే అవకాశం అధికంగా కనిపించింది.

దీంతో శ్రీ రామజన్మ భూమి ట్రస్ట్ కమిటీ శ్రీవారి ఆలయంలో వితరణ చేసే ఉచిత లడ్డూలను పంపాలని కోరింది. దీంతో ప్రత్యేకంగా 25 గ్రాముల చిన్న లడ్డూలను టీటీడీ తయారు చేయిస్తుంది. దాదాపు లక్షకు పైగా లడ్డూలను టీటీడీ అయోధ్యకు పంపనుంది. శ్రీ రామచంద్ర మూర్తి ఆలయానికి తరలించే లడ్డూ ప్రసాదం తయారీకి ముఖ్యంగా స్వచ్ఛమైన దేశి నెయ్యి అవసరం ఉంటుంది. ఆ నెయ్యి కొనుగోలుకు రూ.30 లక్షలు విరాళంగా సమర్పించారు పాలకమండలి సభ్యుడు సౌరభ్.