Corona: జేఎన్.1 కలకలం.. ఎవరూ ఆందోళన చెందొద్దు: కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్
పనాజీ: కరోనా (Corona) కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ (Shripad Naik) అన్నారు..
ఆదివారం ఆయన దక్షిణ గోవాలో పాంచజన్య వార పత్రిక నిర్వహించిన ‘సాగర్ మంథన్ 2.0 ‘ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిపై దేశం గతంలోనే పోరాడిందని.. కొత్త వేరియంట్‌పై ప్రజలు, పర్యాటక పరిశ్రమకు ఆందోళన అవసరంలేదన్నారు. కొత్త కేసుల వ్యాప్తితో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశం ఉంటుందా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి స్పందిస్తూ.. ‘భయపడాల్సిన అవసరం లేదు. అది మళ్లీ వచ్చినా మనం పోరాడగలం. గతంలోనూ మనం ఈ మహమ్మారిపై పోరాడాం” అని సమాధానం ఇచ్చారు..
కేంద్ర ప్రభుత్వ అమలుచేస్తోన్న ప్రగతిశీల విధానాలతో కొవిడ్ మహమ్మారి తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుందన్నారు. పర్యాటక రంగం సైతం గత పరిస్థితులకు భిన్నంగా ఉపాధిలో కొత్త అవకాశాలను కల్పించడంలో దోహదపడుతున్నాయన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 656 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆదివారం నాటికి దేశంలో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 3,742కి చేరింది..
మరోవైపు, దేశంలో డిసెంబర్ 21 వరకు 22 కొత్త కొవిడ్ వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో అత్యధికంగా కేసులు గోవా(21)లో వెలుగులోకి వచ్చాయి. మిగిలిన ఒక్కటీ కేరళలో బయటపడింది. ఈ వేరియంట్ సోకిన వారు స్వల్ప లక్షణాలతో మాత్రమే బాధపడుతున్నారని, తొందరగా కోలుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు..