TRINETHRAM NEWS

Trinethram News : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు లోకేశ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన ఇప్పటికే యువగళం పేరుతో ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ యువనేత మరింత దూకుడు పెంచుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలవాలన్న లక్ష్యంతో నారా లోకేష్ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.

ప్రతిరోజూ స్థానిక కార్యకర్తలతో మమేకమవుతూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నాడు.

అయితే లోకేశ్ తమిళనాడుకు వెళ్లబోతున్నారని, ఇది టీడీపీ ప్రయోజనాల కోసం కాదని, బీజేపీ కోసమేనని చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు. కోయంబత్తూరు పార్లమెంటరీ పరిధిలో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. బీజేపీ అధినాయకత్వంతోపాటు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైతో కూడా లోకేష్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. కూటమిలో టీడీపీ భాగస్వామి కావడంతో కోయంబత్తూరులో లోకేష్ సేవలను వినియోగించుకోవాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరీ ముఖ్యంగా టీడీపీ వారసుడు లోకేశ్ ఇతర రాష్ట్ర నేతలతో సత్సంబంధాలు నెరపడం చాలా అవసరం. తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ఒకరైన అన్నామలై తరఫున ప్రచారం చేయడం ద్వారా వీరి ఇద్దరి కలయిక ఆసక్తికరంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో తమిళ సెటిలర్ల మాదిరిగానే, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో కూడా తెలుగువారు ఉంటున్నారు. కాబట్టి లోకేష్ ప్రచారం కోయంబత్తూరులో బీజేపీకి లాభిస్తుందని, అందుకే బీజేపీ నుంచి టీడీపీ యంగ్ గన్ ను ఆహ్వానించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే నారా లోకేశ్ తమిళనాడు ఎన్నికల్లో క్యాంపెనింగ్ చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.