TRINETHRAM NEWS

బాలికలకు మెరుగైన వైద్యం అందిస్తాం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

*అస్వస్థతకు గురైన కే.జి.బీ.వి విద్యార్థులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి, అక్టోబర్ -28: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కేజీబీవీలో అస్వస్థతకు గురైన బాలికలు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు.

సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న ముత్తారం మండల కేంద్రములోని కే.జి.బి.వి విద్యార్థినులను జిల్లా కలెక్టర్ కోయ హర్ష తో కలిసి పరామర్శించారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ముత్తారం మండలంలోని కే.జి.బీ.విలో బాలికలు అస్వస్థతకు గురైతే హాస్టల్ వార్డెన్ సమాచారం అందించడంతో వెంటనే జిల్లా ఆసుపత్రికి 53 మంది చిన్నారి బాలికలను తరలించి 10 మంది వైద్యులు, 20 మంది స్టాఫ్ నర్సులు ఆధ్వర్యంలో అత్యుత్తమ చికిత్స అందించామని అన్నారు.

బాలికలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఐవి ఫ్ల్యుడ్స్, స్టేరాయిడైస్ మొదలగు చికిత్సను అందించామని అన్నారు. కొంత మంది బాలికలకు చలికాలంలో శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కునే మెడికల్ హిస్టరీ ఉందని, వారికి ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌకర్యం చికిత్స అందుబాటులో పెట్టామని అన్నారు.

ఆసుపత్రిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారిని ఇంచార్జి పెట్టి బాలికలకు అందిస్తున్న చికిత్సను పర్యవేక్షిస్తున్నామని, బాలికల తల్లి దండ్రులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగిందని అన్నారు. బాలికలు ఒకే సారి అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలను విచారిస్తున్నామని, అక్కడ సమీపంలో గల డంప్ యార్డ్ ను తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు.

53 మంది బాలికలు క్షేమంగా ఉన్నారని ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యార్థులు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వైద్యులు, కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తారని అన్నారు. కేజీబీవీ పాఠశాలలో కూడా పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత పై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని, భవిష్యత్తులో బాలికలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అన్నారు.

ఈ పర్యటనలో మంత్రి వెంట రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App