
Minister Atchannaidu : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 01 ; 2026 విత్తనాలపై ఆరోపణలు చేసే ముందు జగన్ తన ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలకు సమాధానం చెప్పాలని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.భజన ఓ పత్రిక లో ‘విత్తన గండం’ పేరుతో ప్రచురించిన కథనంలో విత్తన సబ్సిడీ, సరఫరాపై చేసిన ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతున్నామని తెలిపారు. 2018–19లో 50 శాతంగా ఉన్న సెనగ విత్తనాల సబ్సిడీని వైసీపీ పాలనలో 2020–21లో 30 శాతానికి, 2021–22లో 25 శాతానికి ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం దానిని తిరిగి 35 శాతానికి పెంచిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచితే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి 50 శాతానికి ఎందుకు తగ్గించిందో జగన్ సమాధానం చెప్పాలన్నారు. 2014–19 మధ్య ఏటా సగటున 3.20 లక్షల క్వింటాళ్ల సెనగ విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందిస్తే, 2019–24 మధ్య ఆ సగటు 1.55 లక్షల క్వింటాళ్లకు ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2026–27లో సబ్సిడీపై సెనగ విత్తనాల సరఫరాను 1.50 లక్షల క్వింటాళ్ల నుంచి 2.50 లక్షల క్వింటాళ్లకు పెంచుతోందన్నారు. గతంలో రూ.29 కోట్లుగా ఉన్న సెనగ విత్తనాల సబ్సిడీ నిధులను ఈ ఏడాది రూ.78.75 కోట్లకు పెంచామని, సబ్సిడీ శాతంతో పాటు రైతులకు అందించే విత్తనాల పరిమాణాన్ని కూడా పెంచుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.
2019 నుంచి 2023 మధ్య విత్తన సబ్సిడీకి సంబంధించిన సుమారు రూ.477 కోట్లను ఏపీ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు చెల్లించకుండా ఎందుకు పెండింగ్‌లో పెట్టారో జగన్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరిస్తూ, ప్రస్తుత విత్తన సరఫరా బిల్లులను చెల్లిస్తూ ఏపీ సీడ్స్ సంస్థను తిరిగి గాడిలో పెడుతోందన్నారు. సాధారణంగా విత్తన సబ్సిడీ కోసం రూ.240 కోట్లు కేటాయిస్తుండగా, ఈ ఏడాది అదనంగా రూ.109 కోట్లు సమకూర్చి మొత్తం సుమారు రూ.348 కోట్ల నిధులను అందుబాటులో ఉంచామని వెల్లడించారు.
కంటింజెన్సీ ప్రణాళిక కింద మినుములు, పెసలు, ఉలవలు, ఇతర అపరాలు, పశుగ్రాస విత్తనాలను 80 శాతం సబ్సిడీతో అందిస్తున్నామని, ఇప్పటికే సుమారు 40 వేల క్వింటాళ్ల విత్తనాలు రైతు సేవా కేంద్రాలకు చేరాయని, మిగిలిన విత్తనాలు రవాణాలో ఉన్నాయని చెప్పారు. వేరుసెనగ, అపరాలు, చిరుధాన్యాల విత్తనాలు అక్టోబర్ 15 నాటికి రైతు సేవా కేంద్రాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సబ్సిడీని తగ్గించింది ఎవరు? విత్తనాల సరఫరాను తగ్గించింది ఎవరు? ఏపీ సీడ్స్‌కు రూ.477 కోట్ల బకాయిలు పెట్టింది ఎవరు? ఈ మూడు ప్రశ్నలకు జగన్, వైసీపీ నేతలు రాజకీయ ఆరోపణలతో కాకుండా అధికారిక రికార్డులతో సమాధానం చెప్పాలి. మేము వెల్లడించిన ప్రతి గణాంకంపై శాఖ రికార్డులతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe