TRINETHRAM NEWS

Trinethram News : 28/02/2024
ములుగు జిల్లా

జాతర నిర్వహణ తో ఎంతో అనుభవం వచ్చింది.

జాతర కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుమూలల తెలియజేసిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు.


బుదవారం బండారుపల్లి గిరిజన భవన్ లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి , ఎస్పీ శబరిష్ తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మీడియా ప్రతినిధుల కృతజ్ఞత సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జాతర కోసం ఈ ప్రాంత బిడ్డలుగా శ్రీ సమ్మక్క సారమ్మ వనదేవతల కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి తెలియజేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. జాతర నిర్వహణ , నిరంతరం బయట ప్రపంచానికి తెలియజేసిన పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అమ్మవాళ్ళ దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. మొదటిసారిగా జాతర నిర్ణయాధికారంతో నిర్వహించడం జరిగిందని దీని ద్వారా ఎంతో అనుభవం వచ్చిందని అన్నారు. జాతరలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయడం జరిగిందని ప్రతి ఒక్కరి అనుభవాల అనుసారం పుస్తక రూపంలో పొందుపరిచి లోపాలను పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొట్టమొదటిసారిగా యుద్ధ ప్రాతిపాదికన పనులు ప్రారంభించడం జరిగిందని ఊహించిన దానికంటే భక్తుల సంఖ్య పెరిగిందని అయినప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించిన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యంగా మీడియా ప్రతినిధులు జాతర విషయంలో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించాలో జాతరలో జరిగిన లోపాలను అనుభవాలను సూచనలను సలహాలను అందించాలని అందరి సూచనల సలహాల ప్రకారం మేడారం జాతరను మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. జాతర నిర్వహణ త్రిసభ్య కమిటీ ( మంత్రి,కలెక్టర్,ఎస్పీ) మాదిరిగా నిర్వహించడం జరిగిందని అన్నారు. జాతర ముగిసిన అనంతరం వనదేవతలను వన ప్రవేశం చేసే సమయంలో చిరుజల్లులతో అమ్మవారి దీవెనలకు సంకేతంగా రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందని అమ్మవార్ల దీవెనలు అందరికీ ఉంటాయని అన్నారు.

ములుగు కేంద్రంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి గిరిజన యూనివర్సిటీ తరగతులు జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్లు ప్రారంభించడం జరుగుతుందని గోదావరి నది జనాలు రామప్ప సరస్సు నుంచి లక్నవరం సరస్సులోకి మళ్లించే పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతర ముందు నుంచి జాతర ముగిసే వరకు మేడారం ప్రాంతం భక్తులతో కళకళలాడిందని అధికారుల అంచనాలకు మించి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారంటే జాతర గూర్చి మీడియా విస్తృత ప్రచారం ద్వారానే సాధ్యం అయిందని , కవరేజ్ విషయంలో మీడియా ప్రతినిధులకు అసౌకర్యం కలకూడదని ప్రత్యేకంగా మీడియా పాయింట్ ను సైతం నిర్మించామని అన్నారు. జాతర విజయవంతంలో కీలకపాత్ర పోషించిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జాతర విజయవంతం అవడంలో మీడియా అత్యంత కీలక పాత్ర పోషించిందని అన్నారు. జాతర నిర్వహణలో నిరంతరం మంత్రి సహకారం అందించడం జరిగిందని వారు పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం పోలీస్ అధికారులు అర్థవంతంగా విధులు నిర్వర్తించడం జరిగిందని అన్నారు. గత జాతరతో పోలిస్తే ఈ జాతరను ఎలాంటి రోడ్ ప్రమాదాలు జరగకుండా చూసుకుందామని మూల మలుపులు యూ టర్న్స్ వద్ద ప్రత్యేక శ్రద్ధ వహించమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం అదనపు ఎస్పీ సిరి శెట్టి సంకీర్త్ , దేవాదాయ శాఖ అధికారి రాజేందర్, పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎండి రఫీక్ డి.ఎస్.పి రవీందర్, తాహాసిల్దార్ విజయభాస్కర్, రవీందర్, జిల్లా మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.