ఓటమి నుంచి జైలు వరకు అన్నింటికీ జగన్ “సిద్ధం”గా ఉండాలి: ప్రత్తిపాటి
రాజమహేంద్రవరంలో రా.. కదలిరా సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన ప్రత్తిపాటి
ఎన్నికలకు సిద్ధమంటున్న సీఎం జగన్ తర్వాత.. ఓటమి నుంచి జైలు వరకు అన్నింటికీ “సిద్ధం”గా ఉండాల్సిందే అన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. తనను సాగనంపడానికి తాము సిద్ధంగానే ఉన్నామని పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే ప్రజలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే ఓడిపోవడానికి.. తర్వాత పార్టీని మూసేసడానికి కూడా జగన్ సిద్ధంగా ఉండాలన్నారు ప్రత్తిపాటి. ఇప్పుడు చేసుకుంటున్న “సిద్ధం” బ్యానర్లన్నీ అప్పుడు అతడికి బాగా ఉపయోగపడతాయని ఎద్దేవా చేశారు. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం కాతేరులో ఈ నెల 29న చంద్రబాబు హాజరుకానున్న తెలుగుదేశం పార్టీ ‘రా.. కదలిరా’ బహిరంగ సభకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీమంత్రులు యనమల, చిన రాజప్ప, కేఎస్ జవహర్, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలతో కలసి ప్రత్తిపాటి పుల్లారావు సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లపై చర్చించారు. హెలిప్యాడ్, చంద్రబాబు పాల్గొనే వేదిక, పార్కింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతం మీడియాతో మాట్లాడిన ప్రత్త్తిపాటి బాబాయిని చంపించి, తల్లి, చెల్లిని బయటకు గెంటించి, ఇప్పుడు తాను ఒంటరిని అని మొసలి కన్నీళ్లు కార్చుతున్న జగన్ విపరీత ప్రవర్తనను రాష్ట్రం మొత్తం గమనిస్తోందని నిప్పులు చెరిగారు. సంక్షేమ పేరిట బటన్ నొక్కి ఒక చేత్తో రూ.10 వేలు ఇచ్చి మరో చేత్తో రూ.లక్ష లాక్కుంటూ బతకలేని స్థితికి పేద కుటుంబాలను తీసుకొచ్చారని విమర్శించారు.
అందుకే బటన్ నొక్కి డబ్బులు వేశామని జగన్ చెబుతున్న వర్గాలే ఈవీఎం బటన్ నొక్కి జగన్‌రెడ్డిని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అభిమన్యుడిని కాదు అర్జునుడని సొంత డబ్బా కొట్టుకుంటున్న జగన్‌కు ఇన్ని పాపాలు చేశాక అర్జునుడి పదం పలకడానికి కూడా అర్హత లేదన్నా రు ప్రత్తిపాటి. స్వతంత్ర భారతంలోని ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయని అరాచకాలు, దుర్మార్గాలు, అక్రమ కేసులు, అధికార మదంతో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు తిరస్కరించారు కాబట్టే భీమిలిలో జగన్ సభ వెలవెలబోయిందన్నారు. యువగళం పాదయాత్ర ముగింపు సభను మించి నిర్వహించబోతున్నామంటూ ప్రగల్బాలు పలికి నవ్వులపాలయ్యారని అన్నారు. యువగళం పాదయాత్ర ముగింపు సభను వంద ఎకరాల్లో ఏర్పాటు చేస్తే.. వైకాపా సభ కేవలం 16 ఎకరాల్లో ఏర్పాటు చేసి ప్రజలను తరలించడానికి తంటాలు పడ్డారని పేర్కొన్నారు. జగన్ సభలకు అధికారులతో జనాన్ని తరలించి, పోలీసులతో బెదిరించి, బామాలి బలవంతంగా కూర్చోబెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఇప్పటికే అంగీకరించిన జగన్ మళ్లీ నిరాశ, నైరాశ్యంలోనే నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దింపుడు కళ్లెం ఆశగా తన అవినీతి డబ్బు ఎంత పంచినా వైకాపాకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరని విషయాన్ని జగన్‌రెడ్డి తెలుసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల అవినీతి డబ్బును పంపించినట్లు కూడా చెబుతున్నారని తెలిపారు. జగన్‌రెడ్డి ఇచ్చే అవినీతి డబ్బును తీసుకొని తెదేపా-జనసేన కూటమికి ఓట్లేయాలని ప్రత్తిపాటి సూచించారు.