TRINETHRAM NEWS

Trinethram News : అక్షర క్రమంలో, అభివృద్ధిలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్‌ను అప్పులప్రదేశ్‌గా మార్చిన ఘనత వైఎస్‌ జగన్‌కు దక్కుతుందని మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. మళ్లీ గెలవడం సాధ్యం కాదన్న విషయం ఇప్పటికే జగన్‌కు అర్థమైందని.. అందుకే దొంగ బిల్లులు డ్రా చేసుకునేందుకు సచివాలయాన్ని సైతం తాకట్టుపెట్టి అప్పులు తెచ్చారని ప్రతిపాటి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన సచివాలయాన్ని తాకట్టుపెట్టి అప్పు తెవడమే కాకుండా… తాకట్టుపెడితే తప్పేంటని సమర్థించుకోవడం సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. చిలకలూరిపేటలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడారు. అమరావతిలో భవనాలు కట్టలేదు, గ్రాఫిక్స్‌ మాత్రమేనని ఆరోపించిన దద్దమ్మలు… అవే భవనాలను ష్యూరిటీగా పెట్టి అప్పులు తెచ్చారన్నారు. గ్రాఫిక్స్‌ భవనాలకు బ్యాంకులు రుణాలు ఇచ్చాయా..? అని ఆయన ప్రశ్నించారు. అప్పులు తెచ్చి అభివృద్ధి కాకుండా సొంత జేబులు నిప్పుకుంటున్నారని విమర్శించారు . ఎక్కడ పడితే అక్కడ ఎంత దొరికితే అంత అప్పు చేసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నెత్తిన ఒక్కొక్కరిపై 2.04 లక్షల భారం మోపారని ఆరోపించారు. పుట్టిన వాళ్లపైనే కాకుండా పుట్టబోయే బిడ్డపైనా బుణభారం వేశారన్నారు. అమరావతిలో మేం భవనాలు కడితే వాటిపై అప్పులు తెచ్చుకున్న జగన్‌.. విశాఖలో నిజమైన గ్రాఫిక్స్‌ చూపించారని ప్రతిపాటి పుల్లారావు మండిపడ్డారు. వైజాగ్‌ అభివృద్ధి అంటూ చూపిన గ్రాఫిక్స్.. రెండు కోడికత్తులను తిరగేస్తే ఎలా ఉంటుందో అలానే ఉందన్నారు. మింగ మెతుకు లేదుకానీ పిన్నమ్మకు గాజులుచేయిస్తానన్నట్లు…విశాఖలో ఐకానిక్‌ బిల్డింగ్స్‌ కడతానని బడాయి మాటలు చెబతున్నారని పుల్లారావు విమర్శించారు.