షర్మిల , జగన్ మధ్య దూరం పెరుగుతుందా…!
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో విఫలమైన ఆమె సోదరుడు జగన్ తో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు.
తాజాగా క్రిస్మస్ ను పురస్కరించుకొని జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన నారా లోకేష్ కు షర్మిల స్పెషల్ బహుమతి పంపడం చర్చనీయాంశంగా మారింది.
జగన్ కు గట్టి సంకేతాలే పంపినట్లు అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది ముమ్మాటికి రాజకీయంగా, వ్యక్తిగతంగా వైసీపీకి, జగన్ కు ఇబ్బందికర పరిణామాలు ఎదురైనట్టేనని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
వాస్తవానికి ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నా ఇట్టే కలిసి పోతారని అంతా భావించారు. కాంగ్రెస్ పార్టీలో వైయస్సార్ తెలంగాణ విలీన ప్రక్రియ వెనుక జగన్ ఉన్నారని అంతా అనుమానించారు.
కానీ తాజా పరిణామాలతో జగన్ తో షర్మిలకు తీవ్ర విభేదాలు నెలకొన్నాయని తెలుస్తోంది. ఏకంగా లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్స్ పంపించడంతో తమ మధ్య విభేదాలు సమసి పోలేదని.. పెరిగాయన్నంత రీతిలో హెచ్చరికలు పంపారు.
వాస్తవానికి క్రిస్మస్ కు వైయస్ కుటుంబ సభ్యులంతా ఒకచోట కలవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఆ కుటుంబంలో చిచ్చు రేపాయి.
ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్యతో కుటుంబం నిట్ట నిలువునా చీలిపోయింది. జగన్ ను విభేదించి షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశారు. కానీ షర్మిల తో తమకు సంబంధం లేదని ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డి తో జగన్ చెప్పించడం అగ్నికి మరింత ఆజ్యం పోసింది.
తెలంగాణ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడాన్ని కూడా సజ్జన తప్పు పట్టారు. అది ఆమె అంతర్గత విషయమని తేల్చేశారు. తాము స్పందించమని చెప్పారు.
అయితే తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చాలా సందర్భాల్లో షర్మిల ఇబ్బంది పడ్డారు. కెసిఆర్ ప్రభుత్వం ఆమెపై అమానుషంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో మాట మాత్రానికైనా జగన్ స్పందించిన దాఖలాలు లేవు.
ఒకానొక దశలో ఏపీ సీఎంతో భోజనాలు చేస్తారు.. టీ తాగుతారు… కానీ రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం పట్టించుకోరు అంటూ కేసిఆర్ పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారు. తద్వారా జగన్ చర్యలను సైతం తప్పుపట్టారు. అడుగడుగునా అన్నకు నచ్చని విధంగా షర్మిల నడుచుకున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.
ఇప్పుడు ఏకంగా నారా లోకేష్ కు షర్మిల ప్రత్యేక గిఫ్ట్స్ పంపడం వైసిపికి ఇబ్బందికరమే.
సోదరుడు జగన్ తో విభేదాలు వచ్చిన నాటి నుంచి ఆయనతో ఎటువంటి వేదికలు పంచుకోవడానికి షర్మిల ఇష్టపడడం లేదు.
కనీసం బర్త్ డే, రాఖీ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం లేదు. అలాంటిది తన తండ్రి హయాం నుంచి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నారా చంద్రబాబు, లోకేష్ లకు జగన్ చెల్లి క్రిస్మస్ స్పెషల్ గిఫ్ట్ పంపడం వెనుక సోదరుడితో ముదిరిన తీవ్ర విభేదాల కారణమని.. మున్ముందు ఇదే ధోరణితో ముందుకు సాగుతానని ఏకంగా జగన్కు సంకేతాలు పంపినట్లు అయ్యింది.
సాధారణంగా జగన్ మొండి పట్టు సోదరిగా షర్మిలకు తెలుసు. తన చర్యలు జగన్ కు కోపం తెప్పిస్తాయని తెలుసు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ఏకంగా ఆయన రాజకీయ ప్రత్యర్థికి శుభాకాంక్షలు చెబుతుండడం చూస్తుంటే ఆమె తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడినట్లు అయ్యింది.