అరకులోయ జనవరి 11, (త్రినేత్రంన్యూస్): ప్రభుత్వ సేవల విషయంలో అలసత్వం వహించినా, ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించినా, అదనపు వసూళ్లకు పాల్పడినా సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమని శ్రీపూజ హెచ్చరించారు. ముఖ్యంగా సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఆరోగ్య, రెవెన్యూ విభాగాల సిబ్బంది పనితీరుపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని అధికారులకు స్పష్టం చేశారు.
శుక్రవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ… అర్జీదారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, పిలవలేదనే కారణాలతో నిర్లక్ష్యం చూపడం వంటి అంశాలు పరిపాలనలో సహించబోమన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సేవలకు సంబంధించి అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తే, అది అవినీతి నిరోధక చట్టం కింద నేరంగా పరిగణించబడుతుందని తెలిపారు. ఒకసారి ఆ చట్టం కింద కేసు నమోదైతే, తాము లంచం తీసుకోలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత సంబంధిత ఉద్యోగిపైనే ఉంటుందని, అది అత్యంత కష్టసాధ్యమైన ప్రక్రియ అని హెచ్చరించారు.
ప్రభుత్వ యంత్రాంగానికి రక్షణ ఉండాలంటే ప్రతి చర్యను రికార్డు చేయాల్సిందేనని సూచించారు. పదిహేను రోజుల ముందుగా ఇచ్చే నోటీసులు, సర్వ్ చేసిన కాపీలను భద్రంగా ఉంచుకోవాలని, పీహెచ్‌సీల్లో మందుల పంపిణీకి సంబంధించి ఎవరికెప్పుడు మందులు ఇచ్చారన్న వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. అలా చేయడం వల్ల ఎవరైనా డబ్బులు అడిగారని ఆరోపించినప్పుడు, వాస్తవాలను స్పష్టంగా నిరూపించే అవకాశం ఉంటుందన్నారు.
ఐబీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను మరింత మెరుగుపరుచుకోవాలని, ప్రతి శాఖ తమ రికార్డులను స్పష్టంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా అధికారులు రోజుకు కనీసం ఒక గంట సమయాన్ని పిటిషనర్లతో నేరుగా మాట్లాడేందుకు కేటాయించాలని ఆదేశించారు. ఫీల్డ్ అధికారులు ఇచ్చే నివేదికలనే గుడ్డిగా నమ్మకూడదని, బిల్లులు అవ్వకపోయినా అయ్యాయని చెప్పే అవకాశం ఉందని హెచ్చరించారు. నేరుగా బాధితులతో మాట్లాడినప్పుడే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు.
ప్రవర్తన లోపాలు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి డబ్ల్యూఎఫ్ నివేదిక ఆధారంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పద్మలత, ఆర్డీఓ లోకేశ్వర రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


