TRINETHRAM NEWS

హైదరాబాద్ టు అయోధ్య డైరెక్ట్ ట్రైన్… ఛార్జీలు, టైమింగ్స్ వివరాలివే

అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా రామ భక్తుల కల నెరవేరింది. ఇక రామ భక్తులు అయోధ్యకు వెళ్లడమే తరువాయి. అయోధ్య వెళ్లాలనుకునేవారి కోసం హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. అయోధ్య రామమందిరంలో బాల రాముడు కొలువయ్యాడు. ఇక సామాన్య భక్తులకు అయోధ్యలో బాలరాముడి దర్శనం ప్రారంభం కానుంది. మీరు కూడా అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉంది.

హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతీ శుక్రవారం యశ్వంత్‌పూర్ గోరఖ్‌పూర్ రైలు అందుబాటులో ఉంది. ఈ రైలు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

రైలు నెంబర్ 15024 యశ్వంత్‌పూర్ నుంచి గోరఖ్‌పూర్ వరకు అందుబాటులో ఉంది. ఈ రైలు గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరుతుంది. దారిలో ధర్మవరం, అనంతపూర్, కర్నూల్ సిటీ, మహబూబ్‌నగర్ స్టేషన్ల మీదుగా మరుసటి రోజు ఉదయం 10.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

శుక్రవారం ఉదయం 10.50 గంటలకు ఈ రైలు కాచిగూడలో బయల్దేరుతుంది. తెలంగాణలో కాజీపేట్ జంక్షన్, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ప్రధాన స్టేషన్లలో ఆగుతూ మరుసటి రోజు అంటే శనివారం సాయంత్రం 4.24 గంటలకు అయోధ్య ధామ్ జంక్షన్ చేరుకుంటుంది. అక్కడ్నుంచి అయోధ్య రామ్ మందిర్‌కు సులువుగా చేరుకోవచ్చు.

కాచిగూడ – అయోధ్య జంక్షన్ ఛార్జీలు చూస్తే స్లీపర్‌కు రూ.680, థర్డ్ ఏసీకి రూ.1,810, సెకండ్ ఏసీకి రూ.2,625, ఫస్ట్ ఏసీకి రూ.4,470 ఛార్జీ చెల్లించాలి. ఇక ఇప్పటికే ఈ ట్రైన్ బుకింగ్స్ చూస్తే మార్చి వరకు ఫుల్ రిజర్వ్ అయ్యాయి.

ఇక భారతీయ రైల్వే దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి అయోధ్యకు డైరెక్ట్ ట్రైన్స్ నడపనుంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూర్… ఇలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి అయోధ్యకు నేరుగా డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తాయి.