TRINETHRAM NEWS

ప్రజలు ఏం కోల్పోయారో చెప్పేందుకు నేను సిద్ధం.. ఏం పొందారో చెప్పేందుకు సిద్ధమా.. రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు చాలెంజ్‌..!!

Trinethram News : Telangana : పంద్రాగస్టులోపు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పారని సీఎం రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకులు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు ఎంతో భక్తితో వేములవాడ రాజరాజేశ్వరస్వామిని కొలుస్తారని.. అలాంటి రాజన్న మీద ఓట్టు పెట్టి రేవంత్‌ మాట తప్పాడని విమర్శించారు. వేములవాడ రాజన్న దర్శనం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. పాలకుడే పాపం చేస్తే ఆ రాష్ట్రానికి అరిష్టం పడుతుంది.. ప్రజలకు శాపంగా మారుతుందని తెలిపారు. అందుకే రేవంత్‌ చేసిన పాపం ప్రజలకు శాపం కావద్దని వేములవాడ రాజన్నకు మొక్కుకున్నానని తెలిపారు. ఆయనకు జ్ఞానోదయం చేయాలని వేడుకున్నానని చెప్పారు.

పంటలకు మద్దతు ధర రాక, అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. మద్దతు ధర రాకపోవడంతో రైతులు తమ పంటను దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పౌరసరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి గింజ దాకా కొనుగోలు చేసిందని గుర్తు చేశారు.

వడ్లకు బోనస్ ఇచ్చామని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రేవంత్‌ రెడ్డి రైతుబంధు ఎగ్గొట్టిండని.. యాసంగి పంటకు అయినా రైతుబంధు ఇచ్చేలా చూడాలని దేవుణ్ని కోరుకున్నానని అన్నారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మాట తప్పిన రేవంత్‌ రెడ్డి భయం లేదు.. భక్తి లేదన్న అనుమానం కలుగుతుందని వ్యాఖ్యానించారు.

ఆరు గ్యారంటీలు, 420 హామీలు అని ఎన్నికల ముందు చెప్పి.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని హరీశ్‌రావు అన్నారు. రూ.2లక్షలకు పైగా రుణం ఉన్న వాళ్లు పై డబ్బు ఎందుకు కట్టాలి.. ఆ డబ్బు చెల్లిస్తేనే రుణమాఫీ చేస్తానన్న నిబంధన ఏంటని ప్రశ్నించారు. నువ్వు చేసిన తప్పునకు రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నావని నిలదీశారు. పాక్షికంగానే రుణమాఫీ చేశారని అన్నారు. 31 రకాల కారణాలు చెప్పి సగానికి పైగా రుణమాఫీ చేయలేదని విమర్శించారు. తక్షణమే రుణమాఫీ చేసి, దేవుడి దగ్గర చెంపలు వేసుకోవాలని సూచించారు.

కేసీఆర్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం రేవంత్‌ రెడ్డికి లేదని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు.. ప్రత్యేక రాష్ట్రం లేదు.. నువ్వు సీఎం అయ్యేవాడికి కాదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ అన్న మాటల్లో తప్పేముందని నిలదీశారు. మీ పాలనలో ప్రజలకు ఏం మేలు జరిగిందని ప్రశ్నించారు. ఈ 11 నెలల పాలనలో తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో చ్పెడానికి సిద్ధం.. ఏం పొందారో చెప్పడానికి నువ్వు సిద్ధమా అని సవాలు విసిరారు. అప్పులు, రైతుల సమస్యలు, ఆస్పత్రులు, తాగు నీరు, సాగు నీరు, కరెంటు, విద్య, వైద్యం.. ఇలా అన్ని అంశాల్లో చర్చ చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 36 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని హరీశ్‌రావు తెలిపారు. కొవిడ్‌ సమయంలోనూ కేసీఆర్‌ రైతుబంధు ఇచ్చారని.. కానీ మీ పాలనలో ఇప్పటికీ రైతుబంధు పడటం లేదని అన్నారు. పోలీసులే తమ పోలీసులు కొట్టేలా చేశావని పేర్కొన్నారు. నేతన్నలు ఆత్మహత్యల పాలు చేస్తున్నావని.. అశోక్ నగర్ లో నిరుద్యోగ యువతను వీపులు పగిలేలా కొట్టారని.. దళిత బంధు కోల్పోయారని.. రైతుబంధు కోల్పోయారని.. గొర్రెలు కోల్పోయారని.. చేప పిల్లలు కోల్పోయారని.. ఉద్యోగాలు కోల్పోయారని.. ప్రభుత్వ ఉద్యోగులు డీఎ కోల్పోయారని.. శాంతిభద్రతలు కోల్పోయారని.. జర్నలిస్టులు ప్రశ్నించే హక్కు కోల్పోయారని.. తెలంగాణ ప్రజలు ప్రశాంతతను కోల్పోయారని అన్నారు. మొత్తంగా తెలంగాణ నెంబర్ 1 స్థానం కోల్పోయిందని తెలిపారు.

కేసీఆర్‌ పాలనలో తెలంగాన నంబర్‌ వన్‌ ఉంటే.. రేవంత్‌ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకు వచ్చారని హరీశ్‌రావు అన్నారు. ఇప్పటికైనా పగ, ప్రతీకారం మాని సీనియర్లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తెలంగాణ కోసం పోరాడింది బీఆర్‌ఎస్‌ పార్టీ అని.. కేసీఆర్‌ వందేళ్ల అభివృద్ధి చేస్తే.. రేవంత్‌ ఏడాది కాకముందే రాష్ట్రాన్ని వందేళ్ల వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం మీద, పరిపాలన మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేయాలని.. రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో వేయాలని డిమాండ్‌ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App