Harish Rao’s strong warning to Congress
Trinethram News : నగరంలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు..రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే వరదల కారణంగా భారీ నష్టం సంభవించిందన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం..
ఖమ్మం, సెప్టెంబర్ 03: నగరంలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు.. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే వరదల కారణంగా భారీ నష్టం సంభవించిందన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయిందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగానే భారీ నష్టం వాటిల్లిందని విమర్శించారు. వరద బాధితులకు సహాయం చేసేందుకే తాము ఇక్కడికి వచ్చామన్నారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులు ఉండి కూడా జిల్లా ప్రజలను కాపాడలేకపోయారని హరీష్ రావు విమర్శించారు. పాలనపై పట్టుకోల్పోయిన సీఎం.. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ నష్టం జరిగిందన్నారు. కట్టు బట్టలు తప్ప తమవద్ద ఏమీ లెవని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీష్ రావు తెలిపారు. వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోల్పోయిన వస్తువులకు రూ. 2 లక్షల ఆర్థిక పరిహారం ఇవ్వాలన్నారు. ఎంతో మంది విద్యార్థుల సర్టిఫికెట్లు వరదలో కొట్టుకుపోయాయని.. వారి సర్టిఫికెట్లను వారికి ఇప్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. వరద బాధితులకు కనీసం మంచినీళ్లు, అన్నం కూడా అందించలేకపోయారని ప్రభుత్వం తీరుపై హరీష్ రావు ధ్వజమెత్తారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం కారణంగా ఈ ఘోరం జరిగిందని హరీష్ రావు విమర్శించారు. వరదల కారణంగా 28 మంది చనిపోతే.. ప్రభుత్వం మాత్రం 16 మందిని మాత్రమే చూపిస్తోందని ఆరోపించారు. భక్త రామదాసు, పాలమూరు ప్రాజెక్టులు మునిగిపోయాయని.. దీనంతటికీ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే అని తూర్పారబట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ధోరణి కారణంగా వేల ఎకరాల్లో పంట నీట మునిగిందన్నారు. పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో పంట నష్టానికి రూ. 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారని.. ఇప్పుడు పంట నష్టానికి ఎకరాకు రూ. 30 వేలు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే పొలాలు బాగు చేసుకోవడానికి రూ. 50 వేలు ఇవ్వాలన్నారు.
అధికారంలో ఉండి.. ప్రతిపక్ష సహాయం చేయాలని అడుగున్నారని ప్రభుత్వం పెద్దల తీరుపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి చేతకానితనాన్ని, వారికి అంటిన బురదను ప్రతిపక్షంపై చల్లే కుట్ర చేస్తోన్నారని ఆరోపించారు. వరదలపై రాజకీయం చేస్తు్న్న ముఖ్యమంత్రిని తొలిసారి చూస్తున్నామన్నారు. ప్రభుత్వం తరఫున ఖమ్మం వచ్చిన ఆరుగురు ప్రముఖులు ఉపన్యాసాలు చెప్పారు తప్ప.. ప్రణాళిక గురించి మాట్లాడారా? అని హరీష్ రావు ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఫెల్ అయ్యారని.. అందుకే ముఖ్యమంత్రి వచ్చారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఓ అమ్మాయ మీద దాడి చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని విమర్శించారు.
ఆ అమ్మాయిని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మేల్యేగా ప్రజల కష్టాల తెలుసుకోవడాని వస్తే తమపైనా దాడి చేశారని కాంగ్రెస్ శ్రేణులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేయడమే కాంగ్రెస్ ప్రజా పాలనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తమ బాధ్యత అని ఉద్ఘాటించారు. వరద బాధితులకు ఇంటికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలన బాగుందని ప్రజలే అంటున్నారని పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు హరీష్ రావు.
వారిని అభినందిస్తున్నా..
కాగా, ఖమ్మం వరదల్లో చిక్కుకున్న బాధితులను కాపాడిన వారిని అభినందిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా వరద బాధితులకు సహాయం అందిస్తామన్నారు. బుధవారం నాడు సిద్ధిపేట నుంచి 4 లారీలలో ఆహార పదార్థాలతో తమ నాయకులు బయలుదేరుతారని.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ నాయకులు సాయం అందించబోతున్నారని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికైనా తేరుకుని.. బాధితులను కాపాడాలని ప్రభుత్వానికి హరీష్ రావు సూచించారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App