
సంక్రాంతి పండగకు విడుదలైన హనుమాన్ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్ హీరో సినిమాకు ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లు తక్కువగా కేటాయించినప్పటికీ విడుదలైన నాలుగు రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లు సాధించడం హనుమాన్ సినిమాకు వస్తున్న ఆదరణకు నిదర్శనం. ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు ఈ సినిమాను వీక్షిస్తున్నారు. చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ హనుమాన్ సినిమాను వీక్షించారు. హైదరాబాద్ సిటీలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బాలయ్య కోసం ‘హనుమాన్’ స్పెషల్ షో ప్రదర్శించారు. హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. సినిమాను చూసిన బాలయ్య చాలా హ్యాపీగా ఫీలయ్యారట. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మలతో చిత్ర బృందానికి అభినందనలు తెలిపారట.
