ఇంజెక్షన్ కి బదులు ఇన్సులిన్ చాక్లెట్ ? ఎలా పని చేస్తుందో తెలుసా
మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన చాక్లెట్‌ను అభివృద్ధి చేశారు.
శివ శంకర్. చలువాది
మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన చాక్లెట్‌ను అభివృద్ధి చేశారు. ఇది శరీరంలోని ఇన్సులిన్ అవసరాలను తీర్చే చాక్లెట్. యూఐటీ ఆర్కిటిక్ యూనివర్సిటీ ఆఫ్ నార్వే, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ సంయుక్తంగా దీనిని తయారు చేశాయి.
ప్రపంచవ్యాప్తంగా 42.5 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. వీరిలో రోజుకు 7 కోట్ల మందికి పైగా రోగులు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మధుమేహాన్ని ఎదుర్కోవటానికి నొప్పి లేకుండా, ఇంజెక్షన్ లేకుండా మధుమేహం చికిత్సలో సహాయపడే ఔషధం తయారు చేశారు. ఈ ఇన్సులిన్ చాక్లెట్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిక్ చాక్లెట్ లోపల ఏముంది ?
సిడ్నీ, నార్వే విశ్వవిద్యాలయాల పరిశోధన జర్నల్ నేచర్ నానోటెక్నాలజీలో ప్రచురించారు. ఈ పరిశోధన ప్రకారం డయాబెటిక్ రోగులు ఇప్పుడు చాక్లెట్ లేదా క్యాప్సూల్స్ తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ లోపాన్ని అధిగమించవచ్చు. ఈ చాక్లెట్‌లో మానవ వెంట్రుకల కంటే చిన్న పరిమాణంలో ఉండే నానో క్యారియర్‌లు ఉంటాయి. వీటిలో ఇన్సులిన్ ఉంటుంది. శరీరం తగినంత పరిమాణంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేనప్పుడు, మన రక్తంలో ఉన్న చక్కెరను ప్రాసెస్ చేయడం సాధ్యం కాదు. కణాలలోకి వెళ్లే బదులు ఆ చక్కెర రక్తంలోనే ఉండిపోతుంది. వైద్యులు దీనిని మధుమేహ వ్యాధి అని పిలుస్తారు. శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త చాక్లెట్ శరీరంలో ఇన్సులిన్ సమతుల్యతను మెరుగుపరిచేందుకు పని చేస్తుంది.
చాక్లెట్ నానో క్యారియర్లు ఎలా పని చేస్తాయి ?
నానో క్యారియర్ ఆలోచన చాలా కాలంగా పరిశీలనలో ఉంది. ఇందులో ఒక ప్రధాన సమస్య ఏమిటంటే, ఇన్సులిన్ నానో-క్యారియర్‌లు కడుపు ఆమ్లంతో కలిసినప్పుడు విచ్ఛిన్నమవుతాయి. దాంతో వాటి లక్ష్య స్థానానికి చేరుకోలేవు. అయితే ఇప్పుడు దానికి పరిష్కారం దొరికింది. UiT ఆర్కిటిక్ యూనివర్శిటీ ఆఫ్ నార్వే ప్రొఫెసర్ పీటర్ మెక్‌కోర్ట్ మాట్లాడుతూ ‘మేము ఇన్సులిన్‌ను ఉదర ఆమ్లం ద్వారా విచ్ఛిన్నం కాకుండా రక్షించే పూతను సృష్టించామమని, ఇన్సులిన్‌ను దాని లక్ష్య స్థానానికి చేరుకునే వరకు, ప్రధానంగా కాలేయం వరకు చేరుకునే వరకు సురక్షితంగా ఉంచుతాయని’ చెప్పారు.
రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు, ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్‌లు చురుకుగా మారి ఆ పూతను విచ్ఛిన్నం చేస్తాయి. పూత కరిగిపోయనప్పుడు ఇన్సులిన్ విడుదల చేస్తుంది. ఇది రక్తం నుండి చక్కెరను తొలగించడానికి పని చేస్తుంది. ఇలా చేస్తే షుగర్ పెరిగితే శరీరంలో ఆటోమేటిక్‌గా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది.
ఇంజెక్షన్లు తీసుకోవడం కంటే చాక్లెట్ తినడం మంచిదా ?
ప్రస్తుతం ఉన్న ఇంజెక్షన్ పద్ధతి కంటే ఇన్సులిన్ చాక్లెట్ మంచిదా అనే ప్రశ్న మనస్సులో తలెత్తుతుంది. దీని గురించి ప్రొఫెసర్ పీటర్ మెక్‌కోర్ట్ వివరిస్తూ, ‘ఇన్సులిన్ తీసుకునే వారికి శరీరంలోని అవసరమైన భాగాలకు వేగంగా ఇన్సులిన్ అందజేస్తుంది.’ ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా, ఇది మొత్తం ప్రయోజనాన్ని అందిస్తుంది. శరీరంలో పూర్తిగా ఇది వ్యాప్తి చెంది దుష్ప్రభావాలకు కారణమవుతుంది.
మధుమేహం నిర్వహణకు ఇది అత్యంత ఆచరణాత్మకమైన మార్గమని, ఇది రోగికి కూడా మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో అవసరాన్ని బట్టి ఇన్సులిన్‌ను నియంత్రించవచ్చని, అయితే ఇంజెక్షన్‌లో ఇన్సులిన్‌ను ఒకేసారి విడుదల చేస్తారని వాదిస్తున్నారు. ఈ విధంగా ఇన్సులిన్ లోడ్ చేసిన చాక్లెట్ తినడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు.
చాక్లెట్ ఎప్పుడు వెలువడనుంది.. ?
ఇన్సులిన్ చాక్లెట్ పరీక్షలు ఇప్పటివరకు జంతువుల పై జరిగాయి. చివరిసారి ఇది బాబూన్‌ల పై పరీక్షించారు. పరీక్ష ఫలితాలు బాగున్నాయి. 20 బాబూన్‌ల రక్తంలో షుగర్ లెవల్ తగ్గింది. ఈ చక్కెర రహిత చాక్లెట్‌ను డయాబెటిక్ ఎలుకల పై కూడా పరీక్షించారు. వాటిలోనూ సానుకూల ప్రభావం కనిపించింది. ఇప్పటివరకు ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు. నివేదికల ప్రకారం, ఇది 2025 లో మానవుల పై పరీక్షించనున్నారు. 2 నుంచి 3 ఏళ్లలో సామాన్యులకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.