జూన్ 26, 2026
TRINETHRAM NEWS

రికార్డు స్థాయికి 10 గ్రాముల ధరకిలో వెండి రూ.98,200

Trinethram News : ఈనాడు వాణిజ్య విభాగం: బంగారం ధర కొనుగోలుదార్లకు అందనంతగా దూసుకెళ్తోంది. అంతర్జాతీయంగా చూస్తే, అమెరికా – చైనా మధ్య మాత్రమే టారిఫ్‌ వివాదం అధికంగా ఉండి, మిగిలిన దేశాలతో వాణిజ్య ఒప్పందాల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నా, పసిడిలోకి పెట్టుబడులు భారీగా తరలిరావడంపై బులియన్‌ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాముల) మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర సోమవారం తొలిసారిగా 3,400 డాలర్ల మార్కును అధిగమించింది. ఒక్క రోజులోనే ఔన్సు బంగారం ధర 110 డాలర్లు పెరిగి 3,424 డాలర్లకు, ఔన్సు వెండి ధర 33 డాలర్లకు చేరాయి. అమెరికా డాలర్‌ విలువ రూ.85.15 వద్ద ఉంది. ఫలితంగా దేశీయ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర తొలిసారిగా రూ.1 లక్షను అధిగమించింది. రాత్రి 11.30 గంటల సమయానికి అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 3,413 డాలర్లు, ఔన్సు వెండి ధర 32.6 డాలర్ల వద్ద ఉండగా, హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,00,015 వద్ద, కిలో వెండి ధర రూ.98,200 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

ఈ ఏడాదే రూ.21,000కు పైగా పెరిగిన బంగారం

ఈ ఏడాదిలో మేలిమిబంగారం 10 గ్రాములు రూ.21,000కు (26%) పైగా పెరిగింది. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌- పాలస్తీనా, ఇజ్రాయెల్‌- హెజ్‌బొల్లా (లెబనాన్‌) మధ్య యుద్ధం, చైనాపై అమెరికా భారీ టారిఫ్‌లు, ఆంక్షల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఔన్సు బంగారం ధర 3,000 డాలర్లను మించింది. రూపాయితో పోలిస్తే, డాలర్‌ విలువ దాదాపు స్థిరంగా ఉన్నా.. మరికొన్ని ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే బలహీనపడుతోంది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గి, డాలర్‌ బలహీనపడే అవకాశాలున్నందునే, సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తూ బంగారంపైకి పెట్టుబడులను అంతర్జాతీయ పెట్టుబడిదారులు మళ్లిస్తున్నారని చెబుతున్నారు. ఇవన్నీ కలిసి బంగారం ధర పెరిగేందుకు కారణమవుతోంది.

అంతర్జాతీయ విపణికి, మనకు తేడా ఇదీ

2024 జులై ముందు వరకు పసిడి-వెండిపై 18% పన్ను భారం పడేది. అందువల్ల అంతర్జాతీయంగా ధర తక్కువగా ఉన్నా, ఇక్కడ మరింత అధికంగా ఉండేది. గత జులై బడ్జెట్‌లో కస్టమ్స్‌ సుంకాన్ని 9% తగ్గించారు. అంటే విదేశాలకు మనకు ఇంతమేర తేడా ఉంటుంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, రూపాయితో పోలిస్తే డాలర్‌ విలువ అధికం కావడం వల్ల దేశీయంగా బంగారం ధర మరింత ఎక్కువగా ఉంటోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gold Rs.1,00,000

You cannot copy content of this page