
బాలసముద్రం : వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. రాజకీయ జీవితంలో అనేక మంది ముఖ్యమంత్రులను చూశానని, దివంగత నేత వైఎస్సార్ ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా తాను పార్టీ మారలేదని చెప్పారు. ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే తామంతా కొనసాగుతామని స్పష్టం చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు మీకు బంధువని, వార్‌రూమ్ పర్వతగిరిలో నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయ’ని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు దయాకర్‌రావు స్పందించారు. ప్రణీత్‌రావు అమ్మమ్మ స్వగ్రామం పర్వతగిరి అని మాత్రమే తెలుసునని, అంతకు మించి ఆయన ఎవరో తనకు తెలియదన్నారు. ఫోన్ ట్యాపింగ్, వార్ రూమ్ గురించి కూడా తనకేమీ తెలియదని చెప్పారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. మాయ మాటలు చెప్పి మోసాలు చేయడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటేనన్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే తామంతా వచ్చి ఠాణాల్లో బైఠాయిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్ లోక్‌సభ భారాస అభ్యర్థి డా.కడియం కావ్య, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పాల్గొన్నారు.
